AFGvs NZ: కివీస్ హ్యాట్రిక్ విజయం

వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 246 పరుగుల లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న న్యూజిలాండ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. గాయం నుంచి కోలుకుని రెండు మ్యాచ్‌ల తర్వాత బరిలోకి దిగిన సారధి కేన్స్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్ ఆడిన వేళ బంగ్లాదేశ్‌పై ఘన విజయం నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్.. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్ ఆహ్వానించింది. బరిలోకి దిగిన బంగ్లా బ్యాటర్లకు న్యూజిలాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్... లిట్టన్‌దాస్‌ను అవుట్ చేసి బంగ్లాకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాదేశ్‌ను సారధి షకీబ్ అల్ హసన్, ముష్ఫకీర్ రహీమ్ ఆదుకున్నారు. అయిదో వికెట్‌కు...... 96 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. షకీబ్ అల్ హసన్ 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 40 పరుగులు చేశాడు. ముష్ఫకీర్ రహీమ్ 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు చేశాడు. షకీబ్ అల్ హసన్‌ను ఫెర్గ్యూసన్... ముష్ఫకీర్ రహీమ్‌ను హెన్రీ పెవిలియన్‌కు పంపారు. 41 పరుగులతో మహ్మదుల్లా రాణించడంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ఫెర్య్గూసన్ 3, బౌల్ట్ 2, హెన్రీ 2, శాట్నర్, ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 12 పరుగుల వద్ద రచిన్ రవీంద్రను ముస్తాఫిజుర్ అరెస్ట్ చేశాడు. అనంతరం కాన్వేతో జత కలిసిన సారధి కేన్ విలియమ్సన్ జట్టును విజయతీరాల వైపు నడిపించాడు. జట్టు స్కోరు 92 పరుగుల వద్ద 45 పరుగులు చేసిన కాన్వే అవుటయ్యాడు. ఈ ఆనందం బంగ్లాకు ఎక్కువసేపు నిలువలేదు. మరో వికెట్ పడకుండా కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. 78 పరుగులు చేసిన విలియమ్సన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. డేరిల్ మిచెల్ 67 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 89 పరుగులు చేశాడు. చివరి వరకు అజేయంగా నిలిచిన మిచెల్ మరో వికెట్ పడకుండా కివీస్‌కు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ న్యూజిలాండ్ విజయం సాధించినట్లయింది. బంగ్లా బౌలర్లలో ముష్ఫికర్ రహ్మాన్, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com