క్రీడలు

Nikhat Zareen : ప్రపంచ ఛాంపియన్‌ గా తెలంగాణ బిడ్డ..!

Nikhat Zareen : హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌... మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్వర్ణంపై గురిపెట్టింది.

Nikhat Zareen :  ప్రపంచ ఛాంపియన్‌ గా తెలంగాణ  బిడ్డ..!
X

Nikhat Zareen : ప్రపంచ వేదికల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మొన్నటికి మొన్న భారత షటర్లు సత్తా చాటి థామస్‌కప్‌ బ్యాడ్మింటన్‌ సాధించి చరిత్ర సృష్టించగా.. ఇపుడు భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించడానికి చాలా చేరువైంది. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌... మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్వర్ణంపై గురిపెట్టింది. 52 కిలోల విభాగం సెమీఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన కరోలినా అల్మిడాను చిత్తు చేసింది. తనకంటే మెరుగైన బాక్సర్‌పై నిఖత్‌ పవర్‌ పంచ్‌లను ఏకధాటిగా కురిపించింది. అల్మిడా తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా 5-0 పాయింట్లతో చిత్తుచేసింది.

ఈ ఏడాది స్ట్రాండ్జా మెమోరియల్‌ టోర్నీలో స్వర్ణం సాధించి చక్కని ఫామ్‌లో ఉన్న హైదరాబాదీ నిఖత్‌ జరీన్‌... ఫైనల్‌ చేరే క్రమంలో మేటి బాక్సర్లను కంగుతినిపించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ వేటకు సిద్ధమైంది. ఇప్పటిదాకా ఈ టైటిల్‌ను సాధించిన భార‌త మ‌హిళా బాక్సర్లలో మేరీ కోమ్‌, స‌రితా దేవి, జెన్నీ, లేఖ మాత్రమే ఉన్నారు. ఈ ద‌ఫా ఫైన‌ల్‌లో విన్నర్‌గా నిలిస్తే... హైద‌రాబాద్‌కు చెందిన నిఖ‌త్ కూడా వీరి స‌ర‌స‌న చేరుతుంది. బాక్సింగ్‌లో స‌త్తా చాటుతున్న నిఖ‌త్‌... ఇప్పటికే యువ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచింది. ఈ టోర్నీలో ఆరంభం నుంచి దూకుడుగా సాగుతున్న జ‌రీన్ ఫైన‌ల్‌లోనూ స‌త్తా చాటి టైటిల్ గెలుస్తుందని క్రీడా విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

కాగా ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో రెండు కాంస్య పతకాలు చేరాయి. 57 కిలోల విభాగంలో మనీషా మౌన్‌, 63 కిలోల విభాగంలో పర్వీన్‌ హూడా సెమీఫైనల్లో ఓడడం ద్వారా కాంస్యాలతో సరిపెట్టుకున్నారు.

Next Story

RELATED STORIES