CRICKET: నితీశ్ ప్రయాణం.. ఓ స్ఫూర్తిమంత్రం

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు తెలుగుతేజం, భారత యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. తన రోల్ మోడల్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ తీసుకోవడం కోసం తంటాలు పడిన స్టేజీ నుంచి ఏకంగా అతని ఫ్యామిలీతోనే ఫొటో దిగే రేంజీకి నితీశ్ ఎదగడం వెనక స్ఫూర్తిదాయక ప్రయాణం ఉంది. కోహ్లీని ఎలాగైనా కలవాలన్న కసితో క్రికెట్ లో మెళకువలు నేర్చుకోవడం మొదలు పెట్టాడు నితీశ్. మెల్లిగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన నితీశ్ కు కోహ్లీని కలవడం గగనమైంది. గతేడాది ఐపీఎల్ రూపంలో తనకు లక్ కలిసొచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తనను అనుహ్యంగా ఎంపిక చేసుకుంది. అలాగే అప్పటికే అతని ప్రతిభ గురించి అంతా పాకడంతో తుది జట్టులోనూ చోటు దక్కింది.. తనకు దొరికిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న నితీశ్, అటు బంతితోనూ, ఇటు బ్యాట్ తోనూ సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది 15 ఏప్రిల్ రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో భాగంగా తొలిసారి విరాట్ తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. అప్పుడు నితీశ్ ఆనందానికి అవధులు లేవు. మ్యాచ్ రోజున స్వర్గంతో తేలిపోయినట్లు భావించిన నితీశ్, ఆ మధుర క్షణాలను ఆస్వాదించాడు.
డెబ్యూ క్యాప్ కోహ్లీ నుంచే..
ఎవ్వరూ ఊహించని విధంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో నితీశ్ అరంగేట్రం చేశాడు. అంతకుముందు అరంగేట్రం సందర్భంగా ఆటగాళ్లకు అందించే క్యాప్ ను నితీశ్ కు స్వయంగా కోహ్లీ అందించడం విశేషం. ఆ క్షణంలో నితీశ్ గాల్లో తేలిపోయినట్లు భావించి, తన రోల్ మోడల్ కోహ్లీని ఆలింగనం చేసుకున్నాడు. అక్కడి నుంచి వరుసగా నాలుగు టెస్టులు ఆడి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు మెల్ బోర్న్ టెస్టులు క్లిష్టదశలో సూపర్ సెంచరీ (114) చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో ఈ సిరీస్ లో 58కి పైగా సగటుతో 293 పరుగులు చేసి భారత్ తరపున లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు.
నితీష్‌కు జగన్ అభినందనలు
బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో కదం తొక్కిన నితీష్ కుమార్ రెడ్డికి మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మెల్‌బోర్న్‌లో చిన్నవయసులోనే సెంచరీ సాధించిన నితీష్‌కు అభినందనలు. 21 సంవత్సరాల వయసులోనే ఈ ఘనత సాధించటం విశేషం. ప్రపంచ స్థాయి ఆస్ట్రేలియన్ జట్టు మీద నితీష్ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. నితీష్ సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం’ అని జగన్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com