IPL: బుమ్రా లేకపోవడం సవాలే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై స్టార్ పేసర్ బుమ్రా కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వడంపై ఆ జట్టు కోచ్ మహేల జయవర్దనే స్పందించారు. ‘బుమ్రా జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరు. అతడు టీమ్‌కు అందుబాటులో లేకపోవడం నిజంగా మాకు ఓ సవాలే. కానీ ఈ అవకాశాన్ని మా టీంలో మరో బౌలర్ అందిపుచ్చుకోవాలి. మేం కాస్త విభిన్నంగా ప్రయత్నించేందుకు కూడా మాకు ఇదో ఛాన్స్. కానీ మేం ఏది చేసినా మొదట్లోనే చేయాలి. ’ అని చెప్పారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా స్కై
ఐపీఎల్‌లో ఈ నెల 23న ముంబై ప్రారంభ మ్యాచ్‌ను చెన్నైతో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించారు. గత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఆడిన చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ హార్దిక్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరం కానున్నాడు. అందుకు సూర్యను ముంబై తాత్కాలిక కెప్టెన్‌గా నియమించినట్లు MI మేనేజ్‌మెంట్ పేర్కొంది.
ఫ్యాన్స్‌కు హార్దిక్ స్పెషల్ రిక్వెస్ట్
ముంబై ఫ్యాన్స్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ‘నేను జట్టులో ముఖ్యపాత్ర పోషించాలని ఫ్యాన్స్ కోరుకోవడంలో తప్పులేదు. వారితో నేను అంగీకరిస్తున్నా. అయితే, నేను ఎప్పుడు బ్యాటింగ్ చేసినా ఉత్సాహపరచండి. సిక్స్ కొట్టినా.. టాస్‌కు వెళ్లినా అలానే చేయండి. ఇక్కడ నేను ఇతర రంగులను చూడటం లేదు. వాంఖడే స్టేడియంలో మన కలర్‌ను మాత్రమే చూస్తా. మీ నుంచి నేను ఆశించేది అదే. ’ అని అన్నారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని పాండ్యా చెప్పాడు. పాండ్యా తొలి మ్యాచ్ ఆడడం లేదు.
బలహీనంగా ముంబై జట్టు...!
ఐపీఎల్ ఆరంభానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 22 నుంచి ఈ మెగా లీగ్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అయితే ప్రతి సీజన్ లాగే ఈ సారి కూడా ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ముంబై తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. తొలి మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ బలహీనంగా కనిపిస్తుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య, పేసు గుర్రం బుమ్రా లేకుండానే బరిలోకి దిగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com