Wimbledon: 350వ విజయం సాధించిన జకోవిచ్, 3వ రౌండ్‌కి చేరిక

వింబుల్డన్ టోర్నీలో వరల్డ్ నంబర్ 2 ఆటగాడు, సెర్బియా ప్లేయర్ నొవాక్ జకోవిచ్ 2వ రౌండ్‌లో కూడా గెలిచాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జోర్డాన్ థాంప్సన్‌ని 6-3, 7-6(4), 7-5 తేడాతో గెలిచి మూడవ రౌండ్‌కి చేరుకున్నాడు.
ఈ విజయంతో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 350వ మ్యాచ్ గెలిచినట్లయింది. జకో కంటే ముందు అత్యధిక విజయాలతో స్విస్ ఆటగాడు రోజర్ ఫెదెరర్(369), అమెరికన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్(365)లతో ముందున్నారు. ఈ వింబుల్డన్ టోర్నీ గెలిస్తే 8 టైటిళ్లతో రోజర్ ఫెదెరర్ మీద ఉన్న అత్యధిక వింబుల్డన్ గెలిచిన రికార్డును సమం చేస్తాడు. అలాడే వింబుల్డన్ గెలిచే అత్యధిక వయసు ఆటగాడిగా నిలవనున్నాడు. ఈ విజయం వింబుల్డన్‌లో వరుసగా 30వ మ్యాచ్ గెలుపు.
2 గంటల 27 నిమిషాల పాటు సాగిన నిన్నటి మ్యాచ్‌లో జకోవిచ్‌కి విజయం అంత సునాయసంగా ఏమీ రాలేదు. ప్రత్యర్థి థాంప్సన్ గట్టి పోటీ ఇచ్చాడు. తన బలమైన షాట్లతో పాయింట్లు గెలుస్తూ జకోని ఒత్తిడిలోకి నెట్టాడు. రెండు, మూడు సెట్లలో హోరాహోరీగా తలపడ్డాడు. టై బ్రేకర్‌లో థాంప్సన్ పాయింట్ కోల్పోయి సెట్‌ని కూడా వదులుకున్నాడు.
మ్యాచ్ అనంతరం జకోవిచ్ మాట్లాడుతూ.. ఈ రోజు థాంప్సన్‌ని కలవాలనుకున్నానో లేదో తెలీదు, కానీ అతను చాలా అద్భుతంగా ఆడాడు. రెండవ సెట్‌లో అతనికి అదృష్టం కలిసి రాలేదు. అతని ఆటకి అభినందనలు అని థాంప్సన్‌ని మెచ్చుకున్నాడు.
జకోవిచ్ తన తదుపరి రౌండ్‌లో స్టాన్ వావ్రింకా, థామస్ మార్టిన్ మధ్య జరిగే మ్యాచ్ విన్నర్‌తో తలపడనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com