PAK: పాక్‌కు ఇంతకంటే అవమానం ఉంటుందా.?

టీ20 ప్రపంచకప్‌లో మరోసారి నిరాశ కలిగించిన పాకిస్థాన్ జట్టుపై చర్యలు తప్పవా? సూపర్-8 దశ నుంచే నిష్క్రమించడంతో అభిమానులు మాత్రమే కాదు, అధికార వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లపై ఆర్థికపరమైన జరిమానాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు పీసీబీ వర్గాల సమాచారం కలకలం రేపుతోంది. ఒక్కో ఆటగాడిపై లక్షల్లో జరిమానా పడే అవకాశముందని వార్తలు రావడంతో పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో పాకిస్థాన్ ప్రయాణం ఆశించినంతగా సాగలేదు. లీగ్ దశలోనే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న పాక్, భారత చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత అసోసియేట్ దేశాలపై గెలిచి సూపర్-8కు చేరినా, అక్కడ మాత్రం ఒక్క విజయం మాత్రమే సాధించింది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓటమి నుంచి తప్పించుకున్నా, ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై 212 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ కేవలం ఐదు పరుగుల తేడాతో గెలిచింది. అయినప్పటికీ రన్‌రేట్‌లో వెనుకబడి సెమీఫైనల్‌కు చేరలేకపోయింది. న్యూజిలాండ్ ముందంజ వేసి సెమీస్ టికెట్ దక్కించుకుంది.-
ఇది వరుసగా నాలుగో ఐసీసీ టోర్నీ, ఇందులో పాకిస్థాన్ సెమీఫైనల్ దశకు చేరలేకపోయింది. దీంతో జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ప్రభుత్వ పెద్దలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. “ఆటగాళ్లకు అన్ని వసతులు, మద్దతు ఇస్తున్నాం. కానీ కీలక టోర్నీల్లో విఫలమవుతున్నారు. దేశానికి అపకీర్తి తెస్తున్నారు” అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు వార్తలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో పీసీబీ ఆటగాళ్లపై ఆర్థికపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ వార్తల ప్రకారం ఒక్కో ఆటగాడికి రూ.50 లక్షల జరిమానా విధించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే పీసీబీ అధికారికంగా అలాంటి భారీ ఫైన్ విధించలేదని, కేవలం మ్యాచ్ ఫీజులో కోత విధించే ఆలోచన మాత్రమే ఉందని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ఒక్కో ఆటగాడికి సుమారు రూ.16 లక్షల మేర కోత ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఆటగాళ్లకు ఒక్కో టీ20 మ్యాచ్‌కు సుమారు రూ.4.18 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లిస్తున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్‌లో పాక్ ఆడిన ఏడు మ్యాచ్‌లకు గానూ ఒక్కో ఆటగాడికి దాదాపు రూ.29 లక్షల వరకు ఫీజు వచ్చినట్లు అంచనా. అలాంటప్పుడు రూ.50 లక్షల జరిమానా విధిస్తే, ఆటగాళ్లు అదనంగా తమ జేబు నుంచి డబ్బు చెల్లించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వాస్తవంగా జరిగిందా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.
క్రికెట్ చరిత్రలో ఓ జట్టు సరిగ్గా ఆడలేదని మాత్రమే ఆటగాళ్లపై భారీ జరిమానాలు విధించడం అరుదు. సాధారణంగా క్రమశిక్షణా ఉల్లంఘనలపై లేదా నిబంధనలు అతిక్రమించినప్పుడు ఐసీసీ జరిమానాలు విధిస్తుంది. అయితే ఆ జరిమానాలు కూడా సాధారణంగా మ్యాచ్ ఫీజులో కొంత శాతం మాత్రమే ఉంటాయి. జట్టు ప్రదర్శన బాగోలేదనే కారణంతో భారీ ఫైన్ విధించడం అరుదైన పరిణామంగా భావించబడుతోంది. పీసీబీ వర్గాలు మాత్రం తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెబుతున్నాయి. ఆటగాళ్లను ఆర్థికంగా నష్టపరచడం సరైన మార్గమా? లేక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలా? అనే దానిపై చర్చ కొనసాగుతోందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
