WORLD CUP: ప్రపంచకప్‌లో పాక్ బోణీ

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో కాస్త తడబడినా తర్వాత పుంజుకుని.. నెదర్లాండ్స్‌పై విజయంతో ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది.శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాక్.. నెదర్లాండ్స్‌పై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ (68; 8 ఫోర్లు), సౌద్ షకీల్ (52 బంతుల్లో 68; 9 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో రాణించగా.. మహమ్మద్ నవాజ్ (39; 4 ఫోర్లు), షాదాబ్ ఖాన (32; 2 ఫోర్లు, ఒక సిక్సర్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ పదునైన పాక్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. విక్రమ్‌జీత్ సింగ్ (52; 67 బంతుల్లో 4×4, 1×6), బాస్ డి లీడ్ (67; 68 బంతుల్లో 6×4, 2×6)ల పోరాడిన నెదర్లాండ్స్‌కు విజయాన్ని అందించకలేకపోయారు. బౌలర్లు హారిస్ రవూఫ్ (3/43), హసన్ అలీ (2/33) పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 50 ఓవర్లు ఆడలేకపోయింది. 49 ఓవర్లకే ఆ జట్టును 300 లోపే నెదర్లాండ్స్ బౌలర్లు ఆలౌట్ చేశారు. పరిస్థితుల్ని, పిచ్‌ను చక్కగా చదివిన నెదర్లాండ్స్... ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ దత్‌తో బౌలింగ్‌ను ప్రారంభించింది. నెదర్లాండ్స్ బౌలింగ్‌కు పాక్ టాప్‌ఆర్డర్ చిత్తయింది. జమాన్ (12), కెప్టెన్ బాబర్ అజామ్ (5), ఇమాముల్ హక్ (15) పెవిలియన్ చేరుకున్నారు. 38 పరుగులకే పాక్ 3 వికెట్లు కోల్పోయింది. తొలి 10 ఓవర్లలో పాక్ స్కోరు 43/3. ఈ స్థితిలో రిజ్వాన్, షకీల్ జట్టును ఆదుకున్నారు. స్కోరు 100 దాటించారు. అయితే షకీల్‌ను బోల్తాకొట్టించిన ఆర్యన్.. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీశాడు. రిజ్వాన్, షకీల్ నాలుగో వికెట్‌కు 120 పరుగులు జతచేశారు. అనంతరం పేసర్ బాస్ డి లీడ్ పాక్ పని పట్టాడు. అతను ఒకే ఓవర్లో రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ (9)లను ఔట్ చేశాడు. నవాజ్ (39), షాదాబ్‌ఖాన్ (32), షహీన్ అఫ్రిది (13 నాటౌట్), హరిస్ రవూఫ్ (16) పోరాడి పాక్‌కు మెరుగైన స్కోరునందించారు.
ఛేదనలో ఒడౌడ్ (5)ను హసన్ అలీ, ఆకర్‌మ్యాన్ (17)ను ఇఫ్తికార్ అహ్మద్ (1/16) వెనక్కి పంపడంతో నెదర్లాండ్స్ 50 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో విక్రమ్‌జీత్, బాస్ డి లీడ్ గొప్ప పోరాట పటిమ కనబరిచారు. విక్రమ్‌జీత్ 65 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరో ఎండ్‌లో లీడ్ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ పాక్‌ను భయపెట్టాడు. 120/2తో నెదర్లాండ్స్ పటిష్ట స్థితికి చేరుకోవడంతో పాక్ శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో విక్రమ్‌జీత్ వికెట్ పారేసుకున్నాడు. తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు (5)తో పాటు ఎడ్వర్డ్స్ (0), సకిబ్ (10) కూడా ఎక్కువసేపు నిలవలేదు. నవాజ్ (1/31) బంతిని వికెట్ల మీదకి ఆడుకోవడంతో లీడ్ పోరాటం ముగిసింది. కాసేపటికే నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com