PAK: ప్రపంచకప్ బహిష్కరిస్తే... పాక్ మునిగిపోయినట్లే

టీ20 ప్రపంచకప్ వేళ పాకిస్థాన్ క్రికెట్ మరోసారి అనిశ్చితి అంచున నిలిచింది. టోర్నీలో పాల్గొనాలా? బహిష్కరించాలా? లేక భారత్‌తో మ్యాచ్‌ను మానేయాలా? అనే ప్రశ్నలతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర ఒత్తిడిలో ఉంది. శుక్రవారం లేదా సోమవారం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ ప్రకటించగా, ఆ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తునే మలుపు తిప్పేలా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామంటూ పాక్ బెదిరింపు ధోరణి అవలంబించడం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. టోర్నీలో పాల్గొన్నా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న ప్రతిపాదనను కూడా పీసీబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాలు భావోద్వేగ రాజకీయ ప్రతిచర్యలుగా మారితే, దానికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే—అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనలు. అన్ని పూర్తి సభ్య దేశాలు టోర్నీ ప్రారంభానికి కొన్ని నెలల ముందే ‘టోర్నమెంట్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్’ (TPA)పై సంతకాలు చేస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలగడం చట్టబద్ధంగా ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. పాకిస్థాన్ ఇప్పటికే ఈ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. ఇప్పుడు వెనక్కి తగ్గితే అది ప్రత్యక్షంగా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ ఉల్లంఘనకు శిక్ష ఏమిటంటే—భారీ ఆర్థిక దెబ్బ. పీసీబీకి ఐసీసీ నుంచి ప్రతి ఏడాది వచ్చే ఆదాయ వాటా సుమారు 34.5 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో చెప్పాలంటే ఇది రూ.300 కోట్లకు పైగా. టోర్నీని బహిష్కరిస్తే ఈ మొత్తం మొత్తాన్ని నిలిపివేస్తామని ఐసీసీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
ఐసీసీ కొరడా తథ్యం
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పీసీబీకి ఇది తట్టుకోలేని దెబ్బగా మారనుంది. ఇంతటితో పరిణామాలు ఆగవు. ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం జోక్యంతోనే పీసీబీ ఈ నిర్ణయం తీసుకుందని ఐసీసీ భావిస్తే, బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసే అధికారం కూడా ఐసీసీకి ఉంది. గతంలో జింబాబ్వే, శ్రీలంక క్రికెట్ బోర్డులు ప్రభుత్వ జోక్యం కారణంగా ఇదే తరహా నిషేధాలను ఎదుర్కొన్నాయి. అటువంటి పరిస్థితి పాకిస్థాన్‌కూ వస్తే అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా ఒంటరితనంలో పడే ప్రమాదం ఉంది. భవిష్యత్ ప్రభావాలు మరింత తీవ్రమైనవే. పాకిస్థాన్ ఆసియా కప్‌లో పాల్గొనే హక్కును కోల్పోయే అవకాశముంది. అంతేకాకుండా 2028 మహిళల టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా ఐసీసీ రద్దు చేయవచ్చు. ఇది పాక్ క్రికెట్‌కు అంతర్జాతీయ ప్రతిష్ఠాపరంగా భారీ ఎదురుదెబ్బగా మారుతుంది. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (PSL)పై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐసీసీ సభ్య దేశాలకు విదేశీ ఆటగాళ్లకు ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. దీంతో అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు PSLకు దూరమవుతారు. ఇది లీగ్ విలువను, ఆదాయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
