PCB: పాక్ క్రికెటర్లపై వేలాడుతున్న కత్తి

టీ 20 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం పాకిస్థాన్ క్రికెట్ జట్టును వెంటాడుతూనే ఉంది. లీగ్ దశలోనే పాకిస్థాన్ వెనుదిరగడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. మాజీలు, అభిమానుల వరకు పాక్ పేలవ ప్రదర్శనపై భగ్గుమంటున్నారు. ఈ వరుస వైఫల్యాలతో పాక్ క్రికెట్ బోర్డు కూడా కళ్లు తెరిచింది. బోర్డుతో పాటు సెలక్షన్ కమిటీలో ఆటగాళ్ల ఎంపికలో సంపూర్ణ ప్రక్షాళనకు నడుం బిగించింది. అమెరికా, భారత్ చేతిలో పరాజయాలతో పొట్టి ప్రపంచకప్ నుంచి లీగ్ దశలోనే పాక్ వెనుదిరిగింది. భారత్ చేతిలో తక్కువ పరుగుల లక్ష్యాన్నే ఛేదించకపోవడం... అమెరికా చేతిలో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే జట్టులోని సీనియర్ క్రికెటర్లను జట్టునుంచి తొలగించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డులో, జట్టులో, ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల్లో సంపూర్ణ సంస్కరణలు ఆరంభమయ్యాయి. సీనియర్ ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకునే విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు సునిశితంగా పరిశీలిస్తోంది. ఇదేకాక సెలక్షన్ కమిటీని పాత పద్ధతిలోనే కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. అందరూ కూర్చొని చర్చించిన తర్వాతే జట్టును ఎంపిక చేసే పాత పద్ధతిని తిరిగి తీసుకురావాలని పీసీబీ దాదాపుగా నిర్ణయం తీసుకుందని బోర్డు వర్గాలు తెలిపాయి.
పాక్ సీనియర్ ఆటగాళ్లపై వేటు అనే కత్తి వేలాడుతోందని పీసీబీ వర్గాలు తెలిపాయి. పేలవమైన ప్రదర్శనల కారణంగా సెంట్రల్ కాంట్రాక్ట్‌లను కలిగి ఉన్న ఆటగాళ్లను తగ్గించే అవకాశం ఉందని... లేదా పూర్తిగా తొలగించవచ్చని కూడా అంచనా వేశాయి. ఆటగాళ్లకు లభించే ఇతర ప్రోత్సాహకాలను కూడా పరిశీలించాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తానీ ఆటగాళ్ళు తాము బాగా రాణించకపోతే కోచ్‌లను తొలగిస్తారని.,.. తమకు ఏమీ కాదనే భావనలో ఉన్నారని అక్రం అన్నాడు. కోచ్‌లను అలాగే ఉంచి మొత్తం జట్టును మార్చాల్సిన సమయం ఆసన్నమైందని... ప్రతిభ ఆధారంగా కాకుండా కేవలం స్నేహం ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అక్రమ్ విమర్శించారు.
మాజీ టెస్ట్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్‌ను పాక్ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని పాక్ క్రికెట్ బోర్డు అనుకుంటోంది. పీసీబీ గతంలోలానే ఎనిమిది మంది సెలక్టర్ల విధానానికి మళ్లాలని నిర్ణయించుకున్న వేళ వహాబ్ రియాజ్‌ను చీఫ్ సెలెక్టర్‌గా చేయాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇప్పటికే సెలక్షన్ కమిటీలో పనిచేసిన వహాబ్.. ప్రపంచకప్ సమయంలో పాక్ జట్టు సీనియర్ మేనేజర్‌గా కూడా ఉన్నాడు. వాహబ్ రియాజ్... PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి అత్యంత సన్నిహితుడు. పీసీబీ మాజీ చైర్మన్ జకా అష్రఫ్ మూడేళ్లపాటు ఆటగాళ్లకు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్టులను కూడా బోర్డు పునఃపరిశీలిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com