Pakistan: పాకిస్థాన్‌కు ఊహించ‌ని షాక్‌.. ప‌త‌న‌మైన టెస్టు ర్యాంక్‌!

Pakistan: పాకిస్థాన్‌కు ఊహించ‌ని షాక్‌.. ప‌త‌న‌మైన టెస్టు ర్యాంక్‌!
బంగ్లా చేతిలో ప‌రాభ‌వంతో 8వ స్థానానికి ప‌త‌నమైన పాక్‌

స్వ‌దేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు టెస్టు ర్యాంకింగ్ ఏకంగా రెండు స్థానాలు ప‌త‌న‌మైంది. ఈ సిరీస్‌కు ముందు 6వ స్థానంలో ఉన్నా ఆ జ‌ట్టు ప్ర‌స్తుతం 8వ‌ స్థానానికి ప‌డిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను షాన్ మ‌సూద్ సారథ్యంలోని పాక్ జ‌ట్టుపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే. తొలి టెస్టులో పాకిస్థాన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లా, రావల్పిండి వేదిక‌గా జ‌రిగిన‌ రెండో టెస్టులో ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ప్ర‌స్తుతం పాక్ ఖాతాలో కేవ‌లం 76 రేటింగ్ పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. దీంతో పాకిస్థాన్ 1965 త‌ర్వాత అత్యల్ప రేటింగ్ పాయింట్ల (76)ను సాధించిన‌ట్లైంది.

"బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరీస్ ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ ఐసీసీ పురుషుల టెస్టు జ‌ట్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో స్థానానికి చేరుకుంది" అని ఐసీసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇక బంగ్లాదేశ్ ఈ సిరీస్ విజ‌యంతో 13 రేటింగ్‌ పాయింట్లు సాధించినా పాకిస్థాన్‌ కంటే ఒక స్థానం వెన‌క‌బ‌డి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో 124 పాయింట్ల‌తో ఆసీస్ మొద‌టి స్థానంలో ఉంటే, భార‌త్ (120), ఇంగ్లండ్ (108) ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కాగా, 2-0 సిరీస్ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ త‌న స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుంది. టేబుల్ టాపర్ అయిన భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ త‌ర్వాత నాలుగో స్థానంలో ఉంది. పాక్‌పై సిరీస్ క్లీన్‌స్వీప్‌తో బంగ్లా (45.83 శాతం) నాలుగో స్థానానికి చేరుకుంది. ప్ర‌స్తుతం బంగ్లా జ‌ట్టు సెప్టెంబరు 19న చెన్నైలో ప్రారంభం కానున్న భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌పై దృష్టి సారించింది.

ఇక ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025 ఫైన‌ల్ లార్డ్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్-2 జ‌ట్లు ఈ ఫైన‌ల్లో త‌లప‌డ‌తాయి. ప్ర‌స్తుతం ఈ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ (68.52 శాతం), ఆస్ట్రేలియా (62.50 శాతం) తొలి రెండు స్థానాల్లో కొన‌సాగుతున్నాయి. వ‌చ్చే ఏడాది మార్చి- ఏప్రిల్ నాటికి ఏ రెండు జ‌ట్లు టాప్‌లో ఉంటాయో అవే లార్డ్స్ వేదిక‌గా జ‌రిగే ఫైన‌ల్లో పోటీ ప‌డ‌తాయి.

Tags

Next Story