CT 2025: న్యూజిలాండ్ హిట్టు... పాకిస్థాన్ ఫట్టు

CT 2025: న్యూజిలాండ్ హిట్టు... పాకిస్థాన్ ఫట్టు
X
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో పాక్ ఘోర పరాజయం

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 320 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 260 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలర్లను.. న్యూజిలాండ్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోరు చేశారు. కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్.. కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పాక్ బౌలింగ్ ను చీల్చి చెండాడిన న్యూజిలాండ్ బ్యాటర్లు విల్ యంగ్, లేథమ్ సెంచరీలు చేశారు. గ్లెన్ ఫిలిప్స్ 61 పరుగులు చేశాడు. కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. విల్ యంగ్, లేథమ్ సెంచరీలు చేయగా.. గ్లెన్ ఫిలిప్స్ 61 పరుగులు చేశాడు.

పరుగుల కోసం పాకిస్థాన్ పాట్లు

అనంతరం పాక్ జట్టు ఏ దశలోనూ లక్ష్యాన్ని సాధించేటట్లు కనిపించలేదు. భారీ లక్ష్య ఛేదనలో పాక్‌ చతికిలపడింది. పాక్ 15 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. రిజ్వాన్‌ 3 పరుగులు, సౌద్ 6 పరుగులు చేసి వెనుదిరిగారు. బాబర్ ఆజామ్ జిడ్డు బ్యాటింగ్‌తో పాకిస్థాన్ విజయావకాశాలను దెబ్బతీశాడు. ఆచితూచి ఆడిన అతను 81 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నం చేసి ఔటయ్యాడు. కివీస్ 320 పరుగులు చేయగా.. పాక్ 260 పరుగులు చేసింది.

ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్..

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. కివీస్ పేసర్ విల్ ఓ రూర్కీ వేసిన 10వ ఓవర్‌ ఆఖర్ బంతిని వైడ్‌గా షార్ట్ గా వేయగా రిజ్వాన్ కట్ షాట్ ఆడాడు. కానీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లేన్ ఫిలిప్స్ ఎడమ వైపు డైవ్ చేసి బంతిని ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు.

పాక్ సెమీస్ ఆశలు సంక్లిష్టం..

CT 2025లో తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఘోర పరాజయంతో పాక్ సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. భారత్, బంగ్లాదేశ్ తో జరిగే రెండు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాలి. లేదంటే.. మిగిలిన జట్ల విజయావకాశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో పరాజయం. ఇటీవలే ముక్కోణపు టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్లు పాక్ ఓడింది.

Tags

Next Story