KOHLI: "కోహ్లీ... ఇదేం కసి".. పాకిస్థానీ ఆవేదన

KOHLI: కోహ్లీ... ఇదేం కసి.. పాకిస్థానీ ఆవేదన
X
విరాట్‌ కోహ్లీపై పాకిస్థానీల ప్రశంసల జల్లు... పాక్‌తో మ్యాచ్‌ అంటే విరాట్‌ను ఆపలేమని ట్వీట్లు

ప్రత్యర్థి పాకిస్థాన్.. అది చేజింగ్ చేయాల్సిన ఇన్నింగ్స్. ఇంకేముంది తనలోని రన్ మిషన్‌కు నిద్రలేపాడు విరాట్ కోహ్లి. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడి.. భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో కోహ్లి బ్యాటింగ్‌‌పై ఓ పాకిస్థానీ ఆవేదనను వెళ్లగక్కాడు. 'ఈ విరాట్ కోహ్లి ఎప్పుడూ మనపైనే ఎందుకు కసిగా ఆడతాడు. మనం అతడిని ఏమైనా బాధపెట్టామా? మనమేం చేశాం' అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాక్‌తో మ్యాచ్‌ అంటే కోహ్లీని ఆపలేమని చాలా మంది ట్వీట్ చేస్తున్నారు.

కోహ్లీ అసలైన కింగ్: పాక్ మాజీ కెప్టెన్

విరాట్ కోహ్లీపై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ ప్రశంసలు కురిపించారు. ‘విరాట్ హై స్టేజ్ పెర్ఫార్మర్. అతను పెద్ద మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేస్తాడు. కోహ్లీ.. తాను భారత్‌ కోసం మ్యాచ్ గెలుస్తాను. తాను ఆడటమే కాదు, దేశం కోసం మ్యాచ్ గెలుస్తాను అని అనుకుంటాడు. అందుకే అతను ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్. ‘కింగ్’ అని పిలవడానికి కోహ్లీ అర్హుడు. బాబర్ అజామ్ కాదు. కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా బాగా ఆడాడు’ అని అన్నారు.

కోహ్లీపై ప్రశంసలు కురిపించిన పాక్ కెప్టెన్

CT-2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పాక్‌ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ‘చాలా ఈజీగా బంతిని బాదేశాడు. విరాట్‌ను ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. సునాయాసంగా పరుగులు రాబట్టి మా నుంచి మ్యాచ్‌ని లాగేసుకున్నాడు. కోహ్లీ ఫామ్‌లో లేడని అందరూ అన్నారు. కానీ, పెద్ద మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ ఇన్నింగ్స్‌ గొప్పగా అనిపిస్తోంది: విరాట్‌

పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ శతకంతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకునే కీలక మ్యాచ్‌లో రాణించడం సంతోషంగా ఉంది. నా శక్తిని, ఆలోచనలను అదుపులో ఉంచుకున్నా. ఎక్కువ సేపు క్రీజులో ఉండి టీమ్‌కి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. 36 ఏళ్ల వయసులో ఈ ఇన్నింగ్స్‌ గొప్పగా అనిపిస్తోంది’ అని కోహ్లీ తెలిపారు.

టీమిండియాకు ప్రముఖుల విషెస్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ గొప్ప విజయాన్ని అందుకుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా టీమిండియాకు కంగ్రాట్స్ తెలియజేశారు. అద్భుతమైన మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించడం మరచిపోలేని అనుభూతి అని మెగస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మంత్రి లోకేశ్, రాహుల్ గాంధీ తదితరులు జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Next Story