Cricket: వారెవ్వా షహీన్ ... ఒకే ఓవర్లో 4 వికెట్లు

Cricket: వారెవ్వా షహీన్ ...  ఒకే ఓవర్లో 4 వికెట్లు
X
మొదటి ఓవర్లో షహీన్ గణాంకాలు 4Wd, W,W,1,1,W,W

పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ ఆఫ్రీది అద్భుతం చేశాడు. తన బౌలింగ్‌తో అభిమానులు నోళ్లెల్లబెట్టేలా చేశాడు. తను వేసిన మొదటి ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి తనలో పస తగ్గలేదని నిరూపించాడు. 4Wd, W,W,1,1,W,W స్పెల్‌తో గుర్తుండిపోయే గణాంకాలు నమోదు చేశాడు.

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో మ్యాచ్ మొదటి ఓవర్లోనే నలుగురు బ్యాట్స్‌మెన్లని వెనక్కి పంపాడు. నాటింగ్‌హాంషైర్ జట్టు తరపున ఆడుతున్న షహీన్ ఆఫ్రిది T20 మ్యాచ్ తొలి ఓవర్లలోనే 4 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డ్‌ సృష్టించాడు.



శుక్రవారం వార్విక్‌షైర్ బేర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్ వేసిన షాహీన్ తన తొలి బంతికే బేర్స్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ డేవిస్‌ను వికెట్ల ముందు ఆడటంతో LBWగా గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్ పంపాడు. షాహీన్ విసిరిన ఆ యార్కర్‌కి బ్యాట్స్‌మెన్ వద్ద మాధానమే లేకుండా పోయి కిందపడ్డాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన క్రిస్ బెంజమిన్‌ని క్లీన్‌బౌల్డ్ చేయడంతో అతను కూడా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తరువాతి రెండు బంతులకు పరుగులు రావడంతో షహీన్ హ్యాట్రిక్ ఛాన్స్‌ మిస్సయింది. కానీ చివరి రెండు బంతుల్లో డాన్ మౌస్లే, ఎడ్ బార్నార్డ్‌ల వికెట్‌ తీసి జట్టును ఆనందంలో ముంచెత్తాడు.

కానీ షాహీన్ అద్భుత ప్రదర్శన వృథానే అయింది. 169 పరుగుల లక్ష్యంతో బేర్స్ జట్టు బరిలో దిగింది. మొదటి ఓవర్లోనే 4 కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు రాబ్‌ యేట్స్ 46 బంతుల్లో 65 పరుగులు చేయడంతో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

గాయంతో పాకిస్థాన్ జట్టు తరపున పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు షహీన్ ఆఫ్రిదీ దూరమయ్యాడు. అయితే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(PSL) లో లాహోర్ క్వాలండర్స్ జట్టుకు నాయకత్వం వహించి టైటిల్ అందించాడు. T20 బ్లాస్ట్‌ టోర్నమెంట్‌లో నాటింగ్‌హాం జట్టు తరఫున 13 మ్యాచుల్లో 20 వికెట్లు తీసి అదరగొడుతున్నాడు.


Tags

Next Story