ICC: బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ

ICC: బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
X
హైబ్రీడ్ పద్ధతిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. అంగీకరించిన పాక్ క్రికెట్ బోర్డు

ప్రపంచంలోనే ధనిక బోర్డు బీసీసీఐతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరోసారి తెలిసి వచ్చింది. భారత్ రాకపోయిన ఛాంపియన్స్ ట్రోఫీని తమ దేశంలోనే నిర్వహిస్తామని ఇప్పటి వరకూ ప్రగల్భాలు పలికిన పీసీబీ అడుగు వెనక్కి వేసింది. హైబ్రీడ్ పద్ధతిలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అంగీకారం తెలిపింది. పీసీబీతో చర్చలు జరిపిన ఐసీసీ.. ఈ ట్రోఫీ హైబ్రీడ్ పద్ధతిలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. బీసీసీఐ, పీసీబీలతో ఐసీసీ చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఇరు బోర్డులు కూడా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్దతిలో జరిపేందుకు అంగీకరించాయని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాక్ వద్దే ఉంటాయని.. భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం పాకిస్థాన్ లో కాకుండా దుబాయ్ వేదికగా జరుగుతాయని పేర్కొంది. భారత్‌ నాకౌట్‌కు చేరుకుంటే సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు పాకిస్థాన్‌ వెలుపల జరుగుతాయని తెలిపింది.

భారత అభిమానులకు గుడ్‌న్యూస్

భారత క్రికెట్ అభిమానులకు న్యూస్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ స్పోర్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని, లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని పాక్ క్రికెట్‌ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు ఐసీసీ ముందు పీసీబీ పలు డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి - మార్చి మధ్యలో జరుగుతుందని తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. మొన్నటిదాకా హైబ్రిడ్‌ పద్ధతికి తాము ఒప్పుకోమని పీసీబీ చెబుతూ వచ్చింది. అయితే ఈ పద్ధతికి అంగీకరించకుంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఐసీసీ స్పష్టం చేయడంతో పీసీబీ నిర్ణయాన్ని మార్చుకుంది. 2026లో టీ20 ప్రపంచకప్, 2029లో ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2031లో వన్డే ప్రపంచకప్‌లకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఐసీసీ వార్షిక ఆదాయంలో తమ వాటాను పెంచాలని కూడా పీసీబీ డిమాండ్‌ చేస్తోంది. మరి పాక్‌ ప్రతిపాదనపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Tags

Next Story