PCB:షేక్ హ్యాండ్ వివాదం.. అధికారిపై వేటు

భారత్-పాక్ ఆటగాళ్ల హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని సొంత అధికారినే సస్పెండ్ చేసింది. జట్టు క్రికెట్ ఆపరేషన్ష్ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లాపై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసింది. అధ్యక్షుడు నఖ్వీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి వాహ్లాను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. "ఈ విషయాన్ని హ్యాండిల్ చేసే విషయంలో వాహ్లా నుంచి ఎక్కువగా ఆశించాము. అయితే అతను నిరాశపరిచాడు. వాహ్లా కారణంగా భారత్ ముందు పాక్ పరువు పోయింది. టాస్కు ముందే మ్యాచ్ రిఫరీ కరచాలనం విషయాన్ని ప్రస్తావించినా, వాహ్లా పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యాడు" అని పీసీబీ చీఫ్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై పీసీబీ నానా యాగీ చేస్తుంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని నీతులు చెబుతుంది. డిమాండ్లను పరిష్కరించకపోతే యూఏఈతో తదుపరి జరుగబోయే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుంది.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ప్రత్యర్థి టీం సభ్యులను అస్సలు పట్టించుకోలేదు. పలకరింపులు, నవ్వులు, కరచాలనాలు వంటివేమీ లేకుండా ఆట ముగించారు. తమ పని తాము చేసుకుని మైదానాన్ని వీడారు. ఈ విషయంపై టీమిండియా కప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా వివరణ ఇచ్చారు. పాక్ క్రీడాకారులకు టీమిండియా సభ్యులు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై ఓ విలేకరి సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. దీనికి సూర్యకుమారు సూటిగా జవాబిచ్చారు. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికంటే ముఖ్యమైనవని కుండబద్దలు కొట్టారు. ‘జీవితంలో కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికంటే ముఖ్యమైనవి. పహల్గాం దాడి బాధితులకు మేము అండగా ఉంటాము. కాబట్టి, ఈ విజయాన్ని మేము ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సాయుధ దళాలకు అంకితం ఇస్తున్నాము’ అని అన్నారు
స్పందించిన పాక్ కోచ్
అవార్డుల ప్రదానం తరువాత కార్యక్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పాల్గొనలేదు. ఈ విషయమై పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ స్పందించారు. టీమిండియా సభ్యులు తమతో కరచాలనం చేయకపోవడం పాక్ జట్టు సభ్యులను నిరాశపరిచిందని అన్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ కూడా మ్యాచ్ తరువాత జరిగిన వేడుకకు వెళ్లలేదని చెప్పారు. పహల్గాం దాడి తరువాత పాక్‌తో మ్యాచ్‌కు అంగీకరించినందుకు బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే, పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్‌తో పాటు ఇతర దేశాల జట్లు కూడా ఆడే టోర్నీల్లో భారత్ పాలుపంచుకుంటుందని వివరణ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com