PKL: వచ్చేస్తోంది..ప్రో కబడ్డీ లీగ్

కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. ఆగష్టు 29న ప్రారంభం కానున్న ఈ మెగా కబడ్డీ టోర్నమెంట్‌ను నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఈసారి వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాలు 12 జట్లు తలపడే ఈ మెగా లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ సారి వైజాగ్‌లో పీకేఎల్‌కు తెరలేవనుంది. 7ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో పీకేఎల్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. చివరిసారిగా 2018లో పీకేఎల్‌కు వైజాగ్ ఆతథ్యమిచ్చింది. 12 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో టోర్నీ ప్రారంభంకానుంది. ఆగస్టు 29న జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. అదే రోజు బెంగళూరు బుల్స్, పుణేరి పల్టాన్స్ మధ్య రెండో గేమ్ జరగనుంది.
డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ ఆగస్టు 31న తన తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌ను ఎదుర్కోనుంది. మొత్తం టోర్నీలో 108 లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకు నాలుగు వేదికలను నిర్వాహకులు ఎంపిక చేశారు. వైజాగ్, జైపూర్, చెన్నయ్, ఢిల్లీలను వేదికలుగా ఖరారు చేశారు. వైజాగ్‌లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు, జైపూర్‌లో సెప్టెంబర్ 12 నుంచి 28 వరకు, చెన్నయ్ వేదికగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు, ఢిల్లీ వేదికగా అక్టోబర్ 13 నుంచి 23 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు, వేదికలు తర్వాత ప్రకటించనున్నారు.
ఇదో కొత్త అధ్యాయం
ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ, "ప్రో కబడ్డీ లీగ్ ఎదుగుదలలో 12వ సీజన్ ఒక కొత్త అధ్యాయం. ఈ మల్టీ-సిటీ ఫార్మాట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల వద్దకు అత్యుత్తమ కబడ్డీ యాక్షన్‌ను తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా ఈ ఆటకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విశాఖపట్నంకు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. కాగా 12వ సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో మషల్ స్పోర్ట్స్, జియోస్టార్ కలిసి ఈ లీగ్‌ను దేశంలో అత్యంత విజయవంతమైన స్పోర్ట్స్ లీగ్స్ లో ఒకటిగా నిలబెట్టాయి. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమ్ అవుతాయి.
వైజాగ్‌లో తొలి అంచె ముగిసిన తర్వాత సెప్టెంబర్ 12 నుంచి జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక్కడ జరిగే తొలి పోరులో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్‌తో తలపడనుంది. 10వ సీజన్లో చారిత్రాత్మక 1000వ మ్యాచ్‌కు జైపూర్ ఆతిథ్యం ఇచ్చింది. సెప్టెంబర్ 29 నుంచి చెన్నైలోని ఎస్‌డీఏటీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో మూడో లెగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ.. హర్యానా స్టీలర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ రైడర్ నవీన్ కుమార్ తన మాజీ జట్టుపై పోటీపడనుండటం ఆసక్తి రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com