MODI: అశ్విన్ రిటైర్మెంట్ పై మోదీ భావోద్వేగ లేఖ

MODI: అశ్విన్ రిటైర్మెంట్ పై మోదీ భావోద్వేగ లేఖ
X
అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన ‘క్యారమ్ బాల్‌’ను తలపించిందన్న మోదీ

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తు రిటైర్మెంట్ ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు షాకయ్యారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ ఈ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్ టెస్టు ముగిసిన వెంటనే అశ్విన్ చేసిన ఈ ప్రకటన అభిమానులనే కాదు.. టీమ్మేట్లను కూడా షాక్‌కు గురిచేసింది. అశ్విన్ రిటైర్మెంట్‌పై తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన ‘క్యారమ్ బాల్‌’ను తలపించిందని అన్నారు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు అత్యధిక వికెట్లు అందించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడని ప్రశంసించారు.

మోదీ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగాను ఖేల్‌ రత్న అవార్డుతో సత్కరించాలని ఇప్పటికే పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అశ్విన్‌ను అభినందిస్తూ ప్రత్యేకంగా లేఖ రాశారు. అతడి నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ప్రధాని మోదీ అందులో ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు అశ్విన్ నిర్ణయంపై ఆశ్చర్యానికి గురయ్యారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నో ఆఫ్‌ బ్రేక్స్‌, క్యారమ్‌ బంతులతో ప్రత్యర్థులను హడలెత్తించారని వెల్లడించారు. ఇప్పుడీ నిర్ణయం కూడా క్యారమ్‌ బాల్‌ మాదిరిగా ఉందన్నారు. అయితే, ఇలాంటి ప్రకటన చేయడం కూడా అత్యంత కఠినమని అందరికీ తెలుసన్నారు. భారత్‌ కోసం అద్భుతమైన ప్రదర్శన చేశావని ప్రధాని మోదీ వెల్లడించారు. చెన్నై వరదలు వచ్చినప్పుడు సాయం చేసేందుకు ముందుకొచ్చావని మోదీ అన్నారు. ఇక నుంచి జెర్సీ నంబర్ 99ని మేం మిస్‌ కాబోతున్నామని మోదీ పేర్కొన్నారు.

అశ్విన్ నువ్వో ప్రత్యేకం

అన్ని ఫార్మాట్లలో కలిపి మీరు తీసిన 765 వికెట్లలో దేనికదే ప్రత్యేకం. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను కలిగి ఉండటం జట్టు విజయంపై మీ ప్రభావాన్ని చూపుతోంది. టెస్టుల్లో అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టారు. 2011 వన్డే ప్రపంచకప్‌లో విజేత జట్టులో భాగమయ్యారు. అన్ని ఫార్మాట్లలో సీనియర్‌గా కీలక పాత్ర పోషించారు. ఒక మ్యాచ్‌లో సెంచరీ చేయడంతోపాటు ఐదు వికెట్లు తీయడం ద్వారా మీ ఆల్‌రౌండర్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఇది అద్భుతమని మోదీ అన్నారు.

Tags

Next Story