HYD: క్రికెట్‌ అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్‌

HYD: క్రికెట్‌ అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్‌
X
పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి

హైదరాబాద్‌‌లో క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా ప్లేయర్లు విజయకేతనం ఎగరేయడంతో ఫ్యాన్స్ రోడ్ల పైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రోడ్లపై గట్టిగా అరుస్తూ డ్యాన్సులు చేస్తున్న ఫ్యాన్స్‌పై లాఠీఛార్జ్ చేశారు. క్రికెట్ ప్రేమికులు రోడ్ల మీదకు వచ్చి బాణసంచా కాల్చారు. జై భారత్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫ్యాన్స్‌ మీద పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. జాతీయ జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకుంటున్న అభిమానులను పోలీసులు పలు ప్రాంతాల్లో చితకబాదారు. తమపై లాఠీఛార్జ్ చేయడం సరికాదని క్రికెట్ ప్రేమికులు అసహనం వ్యక్తం చేశారు. అయితే లేట్ నైట్ కావడంతో ఆ సమయంలో గుంపులు గుంపులుగా రోడ్లపైకి జనాలు వచ్చి బాణసంచా పేల్చడంతో వాహనదారులు ఇబ్బండి పడతారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని వారిని ఇండ్లకు పంపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.


మధ్యప్రదేశ్‌లోనూ...

క్రికెట్‌ ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయం తర్వాత ఫ్యాన్స్ మహూలో సంబరాలు జరుపుకున్నారు. కాగా, ఈ సంబరాలు 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. పలు దుకాణాలు, ఇళ్లు, వాహనాలను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారు.

కేంద్ర మంత్రి ఆగ్రహం

దిల్‌సుఖ్ నగర్ సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న అభిమానులను పోలీసులు అడ్డుకోవడం దారుణమంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచిన మూమెంట్ ను క్రికెట్ ప్రేమికులు సెలబ్రేట్ చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. జాతీయ జెండాలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తూ, క్రికెటర్ల అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తుంటే వారిపై లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు.

Tags

Next Story