IPL: భారత ఆటగాళ్లపై పాంటింగ్ వివక్ష

పంజాబ్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇండియన్ క్రికెటర్లు పాంటింగ్‌కు కనిపించడం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల పట్ల పాంటింగ్ వివక్షతో వ్యవహరిస్తున్నాడని, ఇలాగైతే ఆ జట్టు టైటిల్ గెలవడం కలలో మాట అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు. 2025 ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఆ టీమ్ గెలిచి, తొలిసారి ట్రోఫీ ముద్దాడుతుందనే అంచనాలున్నాయి. కానీ పంజాబ్ ట్రోఫీ లేకుండానే 2025 సీజన్ ను ముగిస్తుందని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు.
అసలు ఏమైందంటే..?
ఐపీఎల్ 2025లో శనివారం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఫస్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ 200కు పైగా స్కోరు చేసింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో మ్యాక్స్‌వెల్ కోసం ఇండియన్ ప్లేయర్స్ ను కోచ్ పాంటింగ్ పక్కన పెడుతున్నాడని మనోజ్ తివారీ మండిపడ్డాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ 83 పరుగులు చేసి ఔటయ్యాక, నేహాల్ వధేరాను 4వ స్థానంలో పంపాలని తివారీ కోరుకున్నాడు. కానీ, పాంటింగ్ మ్యాక్స్ వెల్‌ను ఆడించాడు. అతను 8 బంతుల్లో 7 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో 20 బంతులు మాత్రమే మిగిలి ఉండగా, 200 ప్లస్ స్కోర్ లక్ష్యంగా పెట్టుకున్న పంజాబ్.. శశాంక్ సింగ్‌ను బ్యాటింగ్ కు పంపించాల్సిందని మనోజ్ తివారి భావించాడు. కానీ ఆ టీమ్ అయిదో స్థానంలో యాన్సెన్, ఆ తర్వాత ఇంగ్లిష్ ను పంపించింది. దీంతో అనుకున్నంత భారీ స్కోరును పంజాబ్ సాధించలేక పోయింది. దీనికి కారణం పాంటింగ్ వ్యవహారశైలేనని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా భారతీయ ప్లేయర్లపై విశ్వాసం లేకపోవడంతోనే, ఇలాంటి పనులు చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. పాంటింగ్‌పై మనోజ్ తీవ్రంగా మండిపడ్డాడు.
ప్లే ఆఫ్స్ కు చేరినా టైటిల్ గెలవదు..
ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఆడుతున్న పంజాబ్ జట్టు.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. 2014లో ఫైనల్ కు చేరినా, రన్నరప్ గా నిలిచింది. ఇదే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. ఈసారి కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ బాగానే పర్ఫామ్ చేస్తోంది. 9 మ్యాచ్ లాడి ఐదు విజయాలు, ఒక రద్దైన మ్యాచ్ తో 11 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం సంపాదించింది. ప్రస్తుత ఆటతీరుతో ఫైనల్ కి చేరుకున్నప్పటికీ, మేనేజ్మెంట్ లోపాలతో మరోసారి రన్నరప్ గానే నిలుస్తుందని తివారీ పేర్కొంటున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com