PUJARA: ఆట నుంచి నయా వాల్ నిష్క్రమణ

చేతిలో బ్యాట్ పట్టుకుని, తలకు హెల్మెట్ పెట్టుకుని క్రీజులో అడుగుపెడతాడు ఆ వీరుడు. భయంకరమైన బౌలర్లను, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు. శరీరానికి దెబ్బలు తగిలాన తొణకడు. క్రీజులో గోడ కట్టేస్తాడు. ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించి తన టీమ్ ను గెలిపిస్తాడు. అతనే టెస్టు క్రికెట్ వీరుడు చతేశ్వర్ పుజారా. ఈ టీమిండియా నయా వాల్ ఆదివారం అన్ని రకాల క్రికెట్ కు గుడ్ బై పలికాడు.
పుజారా భావోద్వేగ పోస్ట్
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై పుజారా భావోద్వేగ పోస్టు పెట్టాడు. "భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, మైదానంలో అడుగుపెట్టిన ప్రతీసారి జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శన చేయడం.. ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనుభవాలు. ఏదో ఒక సమయంలో ఇలాంటి మంచి విషయాలకు వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. భారత్ తరఫున అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని డిసైడ్ అయ్యా. నా కెరీర్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా దేశం, నా రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తా" అని పుజారా పోస్టు పెట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 278 మ్యాచ్‌లు ఆడిన పుజారా 51 సగటుతో 21,301 పరుగుల చేశాడు. ఇందులో 68 సెంచరీలతో పాటు 81 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ, పంజాబ్, సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్సీబీ, పంజాబ్ తరఫున 22 ఇన్నింగ్స్‌ల్లో 390 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో టీమిండియా నెంబర్ 3 బ్యాటర్‌గా అనేక రికార్డ్స్ సృష్టించాడు. 2023లో భారత జట్టుకు దూరమైన పుజారా.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేదు. ఈ సమయంలో భారత నెంబర్ 3 ఆటగాడిగా అనేక మంది ఆడినా.. ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. భారత టెస్టు క్రికెట్లో పుజారా తన దైన ముద్ర వేసి ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.
టీమిండియా నయా వాల్
చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంత్రముగ్ధులై మీరు చూస్తూనే ఉంటారు. అతని క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ, బ్యాటింగ్ పట్ల ఉన్న అభిరుచి, అతను తన వికెట్‌ను కాపాడుకునే తీరు, ధైర్యం, శరీరానికి దెబ్బలు తగిలినా పట్టించుకోకపోవడం ఇలాంటి వాటికి మీరు ఆశ్చర్యపోవాల్సిందే. పుజారా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని నిలిపివేస్తాడు. రాహుల్ ద్రవిడ్ లోటును భర్తీ చేస్తూ టీమిండియా నయా వాల్ గా ఎదిగాడు చతేశ్వర్ పుజారా. 2010లో టీమిండియా తరఫున టెస్ట్ డెబ్యూ చేసిన ఈ 37 ఏళ్ల పుజారా.. తన కెరీర్లో మొత్తంగా 103 టెస్టు మ్యాచులు ఆడాడు. టీమిండియా తరఫున పుజారా చివరగా 2023 జనవరిలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తన కెరీర్లో భారత్ తరఫున.. 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు సాధించాడు. స్వదేశంలో తన మొత్తం టెస్టుల్లో 52.58 సగటుతో 3,839 పరుగులు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పుజారా చివరి టెస్టు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com