PV Sindhu Birthday: హ్యాపీ బర్త్ డే పీవీ సింధు..

భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణుల్లో ఒకరిగా తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఒలంపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో 2 పతకాలు సాధించి దేశ ఖ్యాతిని పెంచిన సింధు, దేశంలో ఎంతో మంది అమ్మాయిలు బ్యాడ్మింటన్ వైపు అడుగులు వేయడానికి ప్రేరణనిస్తోంది. బుధవారం తను 28వ జన్మదినం జరుపుకుంటోంది. పూసర్ల వెంకట సింధు 1995 సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించింది.
2011లో బ్యాడ్మింటన్‌లో ఆరంగ్రేటం చేసిన నాటి నుంచి లెక్కకు మించిన అవార్డులు, మెడల్స్, టైటిళ్లు గెలిచి భారతావని ఖ్యాతిని విస్తరింపజేసింది. భారత క్రీడారంగంలో ఒలంపిక్స్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 2016 రియో ఒలంపిక్స్‌లో రజత పతకం, 2020 టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
ప్రపంచంలోనే అగ్రశ్రేణి మహిళల టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ అయిన ఉబెర్ కప్‌లో సింధు 2 కాంస్య పతకాలను కూడా సాధించింది.
వరల్డ్ బ్యాడ్మింటణ్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన మొట్టమొదటి, ఏకైక క్రీడాకారిణి సింధునే. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సింధు రికార్డ్ ఘనంగా ఉంది. 2019 బేసెల్‌లో జరిగిన ఈవెంట్‌లో బంగారు పతకం కైవసం చేసుకున్న సింధు, 2017, 2018లో రజత పతకం, 2013, 2014 సంవత్సరాల్లో కాంస్య పతకాలు గెలిచి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ముందుకు దూసుకెళ్లింది.
కామన్‌వెల్త్ క్రీడల్లో కూడా తన ప్రతిభ, ఆటతో 2022లో బర్మింగ్‌హాంలో బంగారు పతకం గెలిచిన సింధు, మిక్స్‌డ్ టీం విభాగంలో రజతం కైవసం చేసుకుంది. 2018లో మిక్స్‌డ్ టీం విభాగంలో కూడా బంగారం సొంతం చేసుకుంది. 2014లో కాంస్యం, 2018లో రజతం గెలుపొందింది.
ఆసియా క్రీడల్లో 2 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. 2018లో జకార్తాలో జరిగిన ఈవెంట్‌లో రజత పతకాన్ని, 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెప్టెంబర్‌లో చైనాలో జరగనున్న ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
వ్యక్తిగత పతకాలే కాకుండా BWF నిర్వహించే పలు టైటిళ్లను తన ఖాతాలో గెలుచుకుంది. స్విస్ ఓపెన్, సింగపూర్ ఓపెన్, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వంటి వరల్డ్ టూర్ టైటిళ్లను గెలుచుకుంది.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) ర్యాంకింగ్స్‌లో 2017 ఏప్రిల్‌లో ఆమె అత్యుత్తమంగా 2వ స్థానానికి చేరింది. ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com