Badminton: US ఓపెన్‌కు వెళ్లే భారత టీం ఇదే..

బ్యాడ్మింటన్‌లో కెనడా ఓపెన్ గెలిచిన లక్ష్యసేన్, భారత ఒలంపిక్ పతక విజేత పీవీ సింధులు మంగళవారం నుంచి జరిగే యూఎస్ ఓపెన్‌లో భారత జట్లను ముందుండి నడిపించనున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషర్ వరల్డ్ టూర్-2023లో ఇది 16వ టోర్నమెంట్.
భారత మహిళల విభాగంలో వరల్డ్ 15వ ర్యాంకర్ సింధు ఈ సీజన్‌లో తన పేలవ ఫామ్ కొనసాగిస్తోంది. ఇటీవల ముగిసిన కెనడా ఓపెన్‌లో సెమీఫైనల్లో, వరల్డ్ నంబర్ క్రీడాకారిణి, జపాన్‌కి చెందిన యమగుచి చేతిలో పరాజయం పాలైంది. చివరగా తాను గత మార్చిలో జరిగిన మాడ్రిడ్ ఓపెన్‌లో ఫైనల్ చేరగలిగింది. భారత్ నుంచి సింధుతో పాటుగా మెయిన్ డ్రాలో గద్దె రుత్విక కూడా ఉంది. మరో క్రీడాకారిణి ఫరూఖీ సమియా అర్హత రౌండ్ నుంచి టోర్నీలో పాల్గొననుంది.
పురుషుల విభాగంలో ఇటీవలె కెనడా ఓపెన్ ఫైనల్లో చైనా ఆటగాడు, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ లీ షి ఫెంగ్‌ని ఓడించి టైటిల్ నెగ్గిన లక్ష్యసేన్ ఊపుమీద ఉన్నాడు. ఈ సంవత్సరంలో సేన్‌కి అదే మొదటి టైటిల్. కెనడా ఓపెన్ గెలిచిన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ యూఎస్ ఓపెన్ కూడా నెగ్గాలని చూస్తున్నాడు. టోర్నీలో మూడవ సీడ్‌గా బరిలో దిగనున్నాడు. మొదటి రౌండ్‌లో ఫిన్‌లాండ్ క్రీడాకారుడితో తలపడనున్నాడు. సేన్‌తో పాటుగా సాయిప్రణీత్ కూడా మెయిన్ డ్రాలో ఉంటూ బరిలో దిగనున్నాడు. 2014 కామన్‌వెల్త్ పతక విజేత పారుపల్లి కశ్యప్, శంకర్ ముత్తుసామి సుబ్రహ్మణియన్‌లు అర్హత రౌండ్‌లో ఆడనున్నారు.
డబుల్స్ విభాగంలో స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ టోర్నీలో పాల్గొనడంలేదు. క్రిష్ణ ప్రసాద్ గరగ, విష్ణువర్ధన్ జోడీ మాత్రమే మెన్స్ విభాగంలో పోటీపడనున్నారు. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ పాండా, శ్వేతాపర్ణ పాండా జోడీ, అపేక్ష నాయక్, రమ్య జోడీలు మొదటి రౌండ్‌లో ఆడనున్నారు.
US ఓపెన్ 2023లో పాల్గొనే భారత జట్టు ఇదే..
పురుషుల సింగిల్స్
మెయిన్ డ్రా: లక్ష్య సేన్, బి సాయి ప్రణీత్
క్వాలిఫయర్స్: ఎస్ శంకర్ ముత్తుసామి సుబ్రమణియన్, పారుపల్లి కశ్యప్
-మహిళల సింగిల్స్
మెయిన్ డ్రా: పీవీ సింధు, గద్దె రుత్విక శివాని
క్వాలిఫైయర్స్: ఇమాద్ ఫరూకీ సమియా
-పురుషుల డబుల్స్మెయిన్ డ్రా: కృష్ణ ప్రసాద్ గరగ/విష్ణువర్ధన్ గౌడ్ పంజాల
-మహిళల డబుల్స్
మెయిన్ డ్రా: అపేక్ష నాయక్/రమ్య చిక్‌మెనహల్లి వెంకటేష్, రుతపర్ణ పాండా/శ్వేతపర్ణ పాండా
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com