SINDHU: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?

భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమెకు పెళ్లి ఖాయమైంది. డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈనెల 20న ప్రారంభం కానున్నాయి. ‘‘ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. అయితే గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయానికి వచ్చాం. జనవరి నుంచి ఆమె షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయనున్నట్లు నిర్ణయించుకున్నాం. వచ్చే సీజన్ తనకు ఎంతో ముఖ్యమైనది’’ అని సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. ఇక సింధు మనువాడనున్న వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు ఛాంపియన్‌గా నిలిచింది. జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనాకుచెందిన వు లువో యును సింధు మట్టికరిపించింది. వు లువో యుపై 21-14, 21-16 వరుస సెట్లలో విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆరంభం నుంచే సింధు కసితో ఆడింది. అందరిపైనా సాధికార విజయాలు సాధిస్తూ తుదిపోరుకు చేరుకుంది. ఫైనల్లో చైనా గోడను సింధు దాటగలదా అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ ఆ అనుమానాలను సింధు పటాపంచలు చేసింది. చైనాకుచెందిన వు లువో యుపై వరుస సెట్లలో ఓడించింది. తొలి గేమ్ ను 21-14తో సునాయసంగా గెలుచుకున్న సింధుకు.. రెండో గేమ్ లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. రెండో సెట్ లో చైనా ప్లేయర్ 10-10తో సింధుకు గట్టిపోటీనే ఇచ్చింది. అయితే తను అనుభవాన్నంత ఉపయోగించి.. బలంగా పుంజుకున్న సింధు.. వరుసగా పాయింట్లు సాధించి 21-16 తేడాతో రెండో సెట్‌ను దక్కించుకుంది. ఈ ఘన విజయంతో రెండేళ్ల తర్వాత సింధు తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను గెలిచి అభిమానులకు సంతోషాన్ని అందించింది. 2022 జులైలో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు ఇప్పటివరకూ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ గెలవలేదు. ఈ గెలుపుతో ఆ కొరత కూడా తీరిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com