Badminton: కెనడా ఓపెన్ ప్రారంభం నేడే, ఆశలన్నీ పీవీ సింధుపైనే

భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌లు కెనడా ఓపెన్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నారు. కెనడా ఓపెన్ జులై 4 నుంచి ప్రారంభమవనుంది. అయితే టోర్నీకి పలువురు కీలక ఆటగాళ్లు మిస్ అవనున్నారు. కిదాంబి శ్రీకాంత్, ప్రన్నోయ్‌లు టోర్నీలో ఆడటం లేదు. గత నెలలో ఇండోనేషియన్ ఓపెన్ గెలిచిన డబుల్స్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి, రంకిరెడ్డిలు కూడా ఆడటం లేదు.
ఇటీవలె తైపీ ఓపెన్‌లో బరిలో దిగని సింధు ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది. కెనడా ఓపెన్‌లో కెనడాకు చెందిన 61వ ర్యాంక్ క్రీడాకారిణి తాలియాతో తలపడనుంది. వరల్డ్ 12వ ర్యాంకర్ పీవీ. సింధు ఫామ్ ఈ సీజన్‌లో పేలవంగానే ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 3 టోర్నీల్లో రెండవ రౌండ్ కూడా దాటలేకపోయింది. ఇండోనేషియన్ ఓపెన్‌లో రౌండ్ 16 నుంచి బయటకి వచ్చిన సింధు, సింగపూర్, థాయిలాండ్ ఓపెన్‌లో మొదటి రౌండ్ తర్వాత నిష్రమించింది.
ఈ బ్యాడ్మింటన్ సీజన్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ వరకు వెళ్లగలిగింది. మాడ్రిడ్ మాస్టర్స్‌లో ఫైనల్స్‌కి చేరింది. మలేషియా మాస్టర్స్ టోర్నీలో సెమీ ఫైనల్‌కి చేరింది. మహిళల సింగిల్స్‌లో సింధుతో పాటు, తస్నిమ్ మిర్, గద్దె రుత్విక శివానిలు కూడా టోర్నీలో దిగనున్నారు. తస్నిమ్ వియత్నాం క్రీడాకారిణితో, రుత్విక శివాని థాయ్‌లాండ్ క్రీడాకారిణులతో టోర్నీని మొదలెట్టనున్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి వరల్డ్ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ ఒక్కడే టోర్నీ మెయిన్ డ్రాలో ఉన్నాడు. తన మొదటి మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ త్రీ ర్యాంకర్, థాయ్ క్రీడాకారుడు కున్లావత్ వితిద్సర్న్‌తో తలపడనున్నాడు. భారత 2014 కామన్‌వెల్త్ పతక విజేత పారుపల్లి కశ్యప్, శంకర్ ముత్తుస్వామి సుబ్రహ్మణ్యన్, సాయి ప్రణీత్‌లు క్వాలిఫికేషన్ రౌండ్‌లో పోటీ పడనున్నారు.
పురుషుల డబుల్స్ విభాగంలో క్రిష్ణప్రసాద్, విష్ణువర్ధన్ గౌడ్ జోడీ మాత్రమే టోర్నీలో ఆడుతున్నారు. ఈ జోడీ ఫ్రెంచ్‌కి చెందిన జోడీతో టోర్నీ మొదటలెట్టనున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో తనీషా, అశ్విని పొన్నప్పల జోడీ ఆస్ట్రేలియా జోడీతో మ్యాచ్ ఆడనుంది. మరో జంట రుతుపర్ణ పాండా, శ్వేతపర్ణ పాండాలు కూడా ఆడనున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సుమిత్ రెడ్డి, అశ్విని పొన్నప్పలు జతకట్టి జపాన్ క్రీడాకారులతో మొదటి రౌండ్‌లో తలపడనున్నారు. సాయి ప్రతీక్, తనీషా క్రాస్టోలు క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆడనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com