Rafael Nadal: టెన్నిస్కి గుడ్ బై చెప్పిన రఫెల్ నాదల్, ధోనీ ఏమన్నాడంటే
స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పేశాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్ తనకు చివరిదని వెల్లడించాడు. 2004లో కెరీర్ మొదలుపెట్టిన నాదల్.. ఆ రోజుల్లో ఆండీ రాడిక్, లీటన్ హెవిట్, రోజర్ ఫెదరర్ వంటి దిగ్గజాల మధ్య సంచలన ఆటతో దూసుకొచ్చాడు. మట్టికోట మహారాజుగా పేరుగాంచిన నాదల్.. 20 ఏళ్ల కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. స్పెయిన్ బుల్ టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించాడు.
నాదల్‌పై ఉన్న అభిమానాన్ని ఓ సందర్భంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘నేను ఎప్పుడూ నాదల్‌ను రెండో అభిమాన ప్లేయర్‌గానే చూశా. ఎందుకంటే నాకు ఆండ్రీ అగస్సీ గేమ్ అంటే చాలా ఇష్టం. అతడినే ఎక్కువగా అభిమానిస్తా. ఆ సమయంలో స్టెఫీగ్రాఫ్కు రెండో టెన్నిస్ స్టార్‌గా మద్దతు ఇచ్చేవాడిని. ఆమె తర్వాత ఆ స్థానంలో రఫేల్ వచ్చాడు. అతడు ప్రపంచంలోనే నంబర్‌వన్ ర్యాంకర్‌గా కూడా అవతరించాడు. అతడు ఎప్పుడూ తన ఆటిట్యూడ్‌ను మార్చుకోలేదు. ఓడినా, గెలిచినా ఒకేలా స్వీకరించేతత్వం నాదల్ సొంతం. మ్యాచ్ పోతుందని తెలిసినా.. చివరి పాయింట్ వరకూ పోరాడే వీరుడు నాదల్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటమిని అంగీకరించకూడదనే లక్ష్యంతో ఉంటాడు’’ అని ధోనీ తెలిపాడు.
38 ఏళ్ల రఫెల్ నాదల్ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలవగా.. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉండడం గమనార్హం. యుఎస్ ఓపెన్ 4, వింబుల్డన్ 2, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2 టైటిల్స్ గెలిచాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన రెండో ప్లేయర్‌గా స్పెయిన్ బుల్ నిలిచాడు. సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ (24) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (20) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. నాదల్ ఇప్పటివరకు 135 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com