Rahul Dravid: సారథిగా విఫలమై.. కోచ్‌గా గెలిచి..

2007 మార్చిలో వెస్టిండీస్ గడ్డ మీదే జరిగిన వన్డే ప్రపంచకప్ భారత క్రికెట్ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. దిగ్గజాలతో కూడిన టీమ్‌ఇండియా ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే ఓడిపోవడం ఒకటైతే అప్పటికీ పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ చేతిలో పరాభవం భారత అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. నాడు భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్.. సరిగ్గా 17 ఏండ్ల తర్వాత తాను పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నట్టు సారథిగా విఫలమైనా హెడ్‌కోచ్‌గా ట్రోఫీ అందుకున్నాడు.
సుమారు శతాబ్దంన్నర పాటు ‘మిస్టర్ డిపెండబుల్’గా భారత బ్యాటింగ్ భారాన్ని తన భుజాలపై మోసిన ద్రవిడ్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించాక బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో యువ క్రికెటర్లను సానబెట్టే బాధ్యతను తీసుకున్నాడు. రవిశాస్త్రి నుంచి 2021లో భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ పగ్గాలు అందుకున్న ద్రవిడ్.. మూడున్నరేండ్ల పాటు ‘మెన్ ఇన్ బ్లూ’ను విజయవంతంగా నడిపించాడు. ద్రవిడ్ మార్గదర్శకత్వంలోని భారత జట్టు మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా నిలిచింది.
ఈ మూడేండ్ల కాలంలో రోహిత్ శర్మ సారథ్యాన భారత జట్టు అద్భుతాలు సృష్టించింది. ద్రవిడ్ హయాంలో భారత్.. మూడు సార్లు (2023 టెస్టు చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్) ఐసీసీ టోర్నీలలో ఫైనల్ చేరగా 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ దాకా వెళ్లింది. వాస్తవానికి గతేడాదే ద్రవిడ్ పదవీకాలం ముగిసినా బీసీసీఐ దానిని టీ20 వరల్డ్‌కప్ దాకా పొడిగించింది. కోచ్‌గా తన ఆఖరి మ్యాచ్‌ను ద్రవిడ్ విజయవంతంగా ముగించడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com