RCB vs PBKS: బెంగళూరుకు షాక్.. పంజాబ్ విజయం

వర్షం అంతరాయం కలిగించిన మ్యాచులో బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. వర్షం వల్ల ఈ మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచును 14 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 9 వికెట్ల నష్టానికి కేవలం 95 పరుగులే చేసింది. తొలి ఓవర్ నాలుగో బంతికే అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ (4) క్యాచ్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ కోహ్లీ కూడా (1) అర్ష్‌దీప్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. స్వల్ప తేడాతో బార్ట్‌లెట్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్ (4) పెవిలియన్ చేరాడు. ఆరో ఓవర్ ఓవరి బంతికి జితేశ్ శర్మ (2), ఏడో ఓవర్ తొలి బంతికి కృనాల్ పాండ్య (1) ఔటయ్యారు. దీంతో సగం ఓవర్లు కాకముందే బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 10 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 47/7 పరుగులతో నిలిచింది. 12వ ఓవర్లో హర్‌ప్రీత్ వరుస బంతుల్లో భువనేశ్వర్, యశ్ దయాల్‌ను ఔట్ చేశాడు. 13 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన డేవిడ్.. హర్‌ప్రీత్ వేసిన చివరి ఓవర్లో చివరి మూడు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. దీంతో బెంగళూరు 95 పరుగులైనా చేసింది.
పంజాబ్ తేలిగ్గా..
14 ఓవర్లలో 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ప్రియాన్స్ ఆర్య 16, ప్రభ్ సిమ్రన్ 13 పరుగులు చేసి అవుటయ్యారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 22 పరుగులు జోడించారు. కెప్టెన్ అయ్యర్ కేవలం 7 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారుతుందా అనిపించింది. కానీ పంజాబ్ బ్యాటర్లు.. బెంగళూరుకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లిస్ 14 పరుగులు చేసి అవుటైనా నేహల్ వధేరా 33 పరుగులు చేసి చివరి వరకూ క్రీజులో ఉండి పంజాబ్‌కు విజయాన్ని అందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com