LSG vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్ విన్

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపే లక్ష్యంగా రాయల్స్ టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ అర్ధసెంచరీకి తోడు ధృవ్ జురెల్ రాణించాడు.
ఛేదనలో రాజస్థాన్‌కు మెరుగైన శుభారంభమే దక్కింది. ఓపెనర్లు బట్లర్(34), జైస్వాల్(24) ఫర్వాలేదనిపించారు. యశ్ ఠాకూర్(1/50) బౌలింగ్‌లో బట్లర్ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన శాంసన్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానేసుకున్నాడు. రియాన్ పరాగ్(14) విఫలమైనా..జురెల్‌తో కలిసి శాంసన్ కీలక ఇన్నింగ్స్‌కు తెరతీశాడు.
లక్నో బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. భారీ మైదానాన్ని దృష్టిలో పెట్టుకుంటూ షాట్లతో అలరించాడు. వీరిని విడదీసేందుకు లక్నో కెప్టెన్ రాహుల్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. స్టోయినిస్, అమిత్‌మిశ్రాకు ఒక్కో వికెట్ దక్కింది. అంతకుముందు లక్నో 20 ఓవర్లలో 196/5 స్కోరు చేసింది. రాహుల్(48 బంతుల్లో 76), దీపక్‌హుడా(50) అర్ధసెంచరీలతో రాణించారు. డికాక్ (8), స్టొయినిస్(0), పూరన్ (11) తీవ్రంగా నిరాశపరిచారు. సందీప్‌శర్మ (2/31) రెండు వికెట్లు తీయగా, బౌల్ట్, అవేశ్, అశ్విన్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అజేయ అర్ధసెంచరీతో జట్టును గెలిపించిన శాంసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో మొత్తంగా 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ అనధికారికంగా ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com