ASIA GAMES: భారత్‌కు పతకాల పంట

ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పండింది. ఒకే రోజు ఏడు పతకాలు కొల్లగొట్టింది. రెండు స్వర్ణాలు.. మూడు రజతాలు.. రెండు కాంస్యాలతో అదరగొట్టింది. భారత షూటింగ్ టీనేజీ సంచలనం ఇషా సింగ్ మరోసారి సత్తాచాటింది. అంచనాలను అందుకుంటూ ఈ 18 ఏళ్ల అమ్మాయి ఆసియా క్రీడల్లో మెరిసింది. బుధవారం మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో టీమ్ పసిడి నెగ్గిన ఆమె.. వ్యక్తిగత విభాగంలో వెండి పతకాన్ని ముద్దాడింది. బుధవారం భారత షూటర్ల హవా నడిచింది. షూటర్లు ఒకే రోజు రెండు బంగారు పతకాలు సహా 7 పతకాలను సాధించారు.
మహిళల 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ గౌర్ సమ్రా బంగారు పతకం సాధించింది. 469.6 స్కోర్‌తో సమ్రా మొదటి స్థానంలో నిలిచింది. 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్ విభాగంలోనే పోటీపడిన మరో భారత షూటర్ అషి చౌక్సీ కాంస్య పతకం సాధించింది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో ఈషా సింగ్ రజత పతకం సాధించింది. మహిళ 25మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో మను భాకర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్, 1, 759 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు.
50 మీటర్ల రైఫిల్ టీం ఈవెంట్ లో అషి చౌక్సీ, మనిని కౌషిక్ , సిఫ్ట్ కౌర్ సమ్రా 1764 పాయింట్లతో రజతం సాధించారు. పురుషుల స్కీట్ విభాగంలో.. అంగద్ వీర్ సింగ్ బజ్వా, గురుజోత్ ఖంగుర, అనంత్ జీత్ సింగ్ లతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది. మెన్స్ స్కీట్ .. వ్యక్తిగత విభాగంలో అనంత్ జీత్ సింగ్... రజత పతకం కైవసం చేసుకున్నాడు. సెయిలింగ్ ILCA-7 విభాగంలో.... భారత క్రీడాకారుడు విష్ణు సర్వణన్ కాంస్య పతకం సాధించాడు. తద్వారా మొత్తం 22 పతకాలతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com