RANJI TROPHY: రంజీల్లోనూ స్టార్లు విఫలం

RANJI TROPHY: రంజీల్లోనూ స్టార్లు విఫలం
X
రోహిత్ శర్మ అట్టర్ ఫ్లాప్... పెరుగుతున్న ఒత్తిడి

రంజీ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ స్టార్‌ ప్లేయర్లు విఫలమయ్యారు. టీమ్ ఇండియాలోని రోహిత్ శర్మ, పంత్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, జడేజా తదితరులను దేశవాళీ రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు. కానీ వీరంతా రంజీ ట్రోఫీ తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లతోనే పెవిలియన్ చేరారు. ముంబై తరఫున యశస్వి జైస్వాల్(4), రోహిత్ శర్మ(3), పంజాబ్ తరపున గిల్ (4), ఢిల్లీ తరఫున పంత్(1) మాత్రమే స్కోరు చేయగలిగారు.

రోహిత్ శర్మ అట్టర్ ప్లాప్‌

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అట్టర్ ప్లాప్ అయ్యాడు. జమ్మూకాశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై తరఫున ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్.. 19 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రోహిత్ రిటైర్ కావాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే మ్యాచ్‌లో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే వెనుదిరిగాడు.

'అందుకే రోహిత్‌ వికెట్‌కు సంబరం చేసుకోలేదు'

జమ్మూకశ్మీర్‌తో గురువారం జరిగిన రంజీ మ్యాచ్‌లో ముంబయి తరఫున ఆడిన రోహిత్‌ను 31 ఏళ్ల పేసర్ ఉమర్ నజీర్ ఔట్ చేశాడు. అయితే, రోహిత్ ఔటైన తర్వాత నజీర్‌ పెద్దగా సంబరాలు చేసుకోలేదు. రోహిత్‌కు తాను వీరాభిమానినని, అతని పట్ల గౌరవంగా ఉండాలనుకుంటున్నానని నజీర్‌ పేర్కొన్నాడు. అందుకే వికెట్‌ను సెలబ్రేట్ చేసుకోలేదన్నాడు. ఇక, రోహిత్‍తో పాటు అజింక్య రహానె (12), శివమ్‌ దూబె (0), హార్దిక్ టామోర్ (7)లను ఔట్ చేశాడు.

అదరగొట్టిన సిద్దార్థ్​

రంజీ ట్రోఫీలో ఓ బౌలర్ అదరగొట్టాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో గుజరాత్‌ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ 15 ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులే ఇచ్చాడు. అంతేకాకుండా ఏకంగా 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 5 మెయిడిన్ ఓవర్లు కూడా వేయడం విశేషం. ఈ క్రమంలో వినూ భాయ్‌ ధ్రువ్‌ (8/31)ను అధిగమించి రంజీ ట్రోఫీ చరిత్రలో గుజరాత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు సిద్దార్థ్‌.

WCCలో జైషాకు చోటు

ఐసీసీ చైర్మన్‌ జై షాకు మరో అరుదైన గౌరవం లభించింది. మెరిల్బాన్ క్రికెట్ క్లబ్ కొత్తగా ఏర్పాటు చేసిన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ సలహా మండలిలో జైషాకు స్థానం కల్పించారు. జైషాతో పాటు భారత్ నుంచి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ఐసీసీ సీసీవో అనురాగ్ దహియా, జియో స్టార్ సీఈవో సంజోగ్ గుప్తాలకు కూడా స్థానం లభించింది. జూన్ 7, 8వ తేదీల్లో లార్డ్స్ WCC సమావేశం జరగనుంది. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించనున్నారు.

Tags

Next Story