kohli: రవిశాస్త్రి, టెస్ట్ విజయాలు విడదీయలేనివి : కోహ్లీ

రవిశాస్త్రి సూచనలు, సలహాలు లేకుంటే టెస్ట్ క్రికెట్లో అన్ని విజయాలు సాధ్యమయ్యేవి కాదని టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే రవితో కలిసి పని చేయకుంటే అన్ని విజయాలు సాధించే అవకాశం ఉండేది కాదన్నాడు. ‘క్లిష్ట సమయాల్లో ఆయన నాకు అండగా నిలబడ్డారు. మీడియా సమావేశాల్లో ముందు నిలబడి విమర్శలు ఎదుర్కొన్నారు. నా టెస్ట్ క్రికెట్ జర్నీలో కీలక పాత్ర పోషించినందుకు రవిశాస్త్రిని ఎప్పుడూ గౌరవిస్తాను’ అని కోహ్లీ పేర్కొన్నాడు. మరోవైపు రవిశాస్త్రి కూడా కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ’15 సంవత్సరాలలో అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ప్రపంచ కప్‌లు గెలవచ్చు. ఎన్నో విజయం సాధించొచ్చు. కానీ, టెస్ట్ క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని విరాట్ కోరుకున్నాడు. ఒకసారి తన టార్గెట్‌ను డిసైడ్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేయర్లు అందరూ దానిని అనుసరించాల్సిందే. టీమిండియా టెస్ట్ క్రికెట్ ఇంత బాగుందంటే దానికి ప్రధాన కారణం కోహ్లీ. యంగ్ ప్లేయర్స్ అందరూ అతనికి ధన్యవాదాలు చెప్పాలి’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. టీమిండియాకు వచ్చిన కొత్తలో తనకు భయం, బెరుకు ఉండేవని.. అయితే యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తనకు అండగా నిలిచారన్నాడు కోహ్లీ. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణానికి అలవాటు పడేలా చేశారని.. ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ వచ్చారని తెలిపాడు. వాళ్ల మద్దతుతోనే జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోగలిగానని పేర్కొన్నాడు విరాట్. క్యాన్సర్ రోగుల కోసం యువీ నిర్వహిచిన ఓ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. ఇలా తన కెరీర్ ఆరంభం నుంచి కెప్టెన్సీ వహించడం వరకు జరిగిన పలు విశేషాలను అందరితో పంచుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com