RCB: నూతన కోచ్‌గా ఆండీ ఫ్లవర్, తలరాత మారేనా...!

ఆర్సీబీ(Royal Challenger Bengalore) జట్టుకు నూతన కోచ్ వచ్చాడు. జింబాబ్వే దిగ్గజం, మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌ను తమ జట్టుకు కోచ్‌గా నియమించుకున్నారు. 2024 ఐపీఎల్(IPL) సీజన్ నుంచి ఆర్‌సీబీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇన్నిరోజులు భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ కోచ్‌గా ఉన్నాడు. అయితే మళ్లీ అతనితో ఫ్రాంఛైజీ కాంట్రాక్టును పునరుద్ధరించుకోలేదు.
ఐసీసీ(ICC) హాల్ ఆఫ్ ఫేం లిస్టులో చోటు దక్కించుకున్న మొదటి జింబాబ్వే ఆటగాడు ఆండీ ఫ్లవరే కావడం విశేషం. దశాబ్ధ కాలంగా పలు అంతర్జాతీయ, ప్రముఖ క్రికెట్ ఫ్రాంఛైజీ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్ దాకా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు. హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తూ పీఎస్‌ఎల్, ది హండ్రెడ్, ఐఎల్‌టీ20, టీ10 కప్‌లను గెలిచాడు.
ఇంగ్లాండ్ జట్టుకు కోచ్‌గా స్వదేశంలో, విదేశంలో యాషెస్ టోర్నీని గెలిపించాడు. అంతేగాక 2010 సంవత్సరంలో టీ20 వరల్డ్‌కప్ అందించాడు. అతని హయాంలోనే ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకుకి చేరుకుంది.
ఆండీ క్రికెట్ ఆడే కాలంలో అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడిగా ఉన్నాడు. ఫ్లవర్‌కి 51.54 బ్యాటింగ్ సగటుతో పాటుగా, 63 టెస్ట్ మ్యాచుల్లో 12 సెంచరీలతో విజయవంతమైన క్రికెట్ కెరీర్ ఉంది. ప్లేయర్‌గా, తరువాత కోచ్‌గా భారతీయ పిచ్‌లపై విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఉంది.
ఇన్ని రోజులు జట్టుకు కోచ్‌గా, డైరెక్టర్‌గా సేవలందించిన సంజయ్ బంగర్, హెసన్లకు ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ కృతజ్ణతలు తెలిపింది.
"జట్టు తరపున మైక్ హెసన్, సంజయ్ బంగర్‌లకు కృతజ్ణతలు తెలుపుతున్నాము. గత 4 సీజన్లలో జట్టు అద్భుత ప్రదర్శన చేసి, మూడు సార్లు ప్లే ఆఫ్స్ చేరడంలో ఇద్దరి పాత్ర మరువలేం. పనిపరంగా మీరిద్దరూ ఉన్నత ప్రమాణాల్లో పనిచేశారు. ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను మాకందించారు. మీ భవిష్యత్ ప్రణాళికల్లో మీరు విజయవంతం కావాలని కోరుతున్నాము. నూతన కోచ్ ఆండీ ఫ్లవర్ మీ తరపు బాధ్యతలు తీసుకుని జట్టును ఉన్నత శిఖరాలకు చేరుస్తారు" అని ఆర్‌సీబీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రత్మేష్ మిశ్రా వెల్లడించాడు.
నూతన బాధ్యతలపై ఆండీ ఫ్లవర్ స్పందిస్తూ... ఆర్సీబీ జట్టును మరిన్ని విజయాలు అందించేందుకు కృషి చేస్తానన్నాడు. ముఖ్యంగా కెప్టెన్ డుప్లెసిస్‌తో కలిసి ఆడటం గురించి ఆలోచిస్తున్నానన్నాడు. ఇది వరకే మేం కలిసి పనిచేశాం. ఆ ప్రణాళిలను ఇపుడు అమలు చేసుకుంటూ మా భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com