RCB: తొక్కిసలాటకు కారణం ఆర్సీబీనే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన దర్యాప్తు నివేదిక వచ్చింది. సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. దీనిలో నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ పరేడ్‌కు హాజరు కావాలని ఆర్సీబీ ప్రేక్షకులను ఆహ్వానించిందని నివేదిక పేర్కొంది. జూన్ 4న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌కు ముందు ఈ తొక్కిసలాట జరిగింది. విక్టరీ పరేడ్‌లో 11 మంది మరణించారు. అదే సమయంలో, 50 మందికి పైగా గాయపడ్డారు. నివేదికను గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది, అయితే ఈ గోప్యతకు చట్టపరమైన ఆధారం లేదని కోర్టు తెలిపింది.
ప్రభుత్వ నివేదిక ప్రకారం...
తొక్కిసలాటపై ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం..‘ఐపీఎల్-18 సీజన్లో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో జూన్ మూడో తేదీన ఆర్సీబీ యాజమాన్యం పోలీసులను సంప్రదించి విజయోత్సవ పరేడ్ గురించి చెప్పారు. వేడుకలకు సంబంధించి వారు సమాచారం మాత్రమే ఇచ్చారు. అంతేగానీ.. వేడుకల గురించి ఫార్మట్ ప్రకారం అనుమతులు కోరుతూ ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు. ఇలాంటి ఈవెంట్ల కోసం కనీసం ఏడు రోజుల ముందే అనుమతులు తీసుకోవాలి. కానీ, అలాంటిదేమీ లేకుండా.. విజయం అనంతరం పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్టు పెట్టింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ఉచిత ప్రవేశమని ప్రకటించింది.
కోహ్లీ పేరు కూడా..
విజయం అనంతరం పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్టు పెట్టింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ఉచిత ప్రవేశమని ప్రకటించింది. ఆ తర్వాత.. మరో పోస్టులో విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. అందులో ఆయన ఈ విజయాన్ని బెంగళూరు ప్రజలు, ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని ఉందని పేర్కొన్నారు. దీంతో స్టేడియం సామర్థ్యానికి మించి మూడు లక్షల మందికి పైగా హాజరయ్యారు. స్టేడియం చుట్టూ దాదాపు 14 కి.మీ. దూరం వరకు ప్రజలు గుమిగూడారు. దీంతో మార్గమధ్యలో, స్టేడియం వద్ద పెద్ద మొత్తంలో పోలీసు సిబ్బందిని మోహరించాం. నిర్వాహకులకు సరైన ప్రణాళికలు లేకపోవడం, సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించడంలో విఫలం కావడం వల్లే తొక్కిసలాట జరిగింది.
క్యాట్ అభిప్రాయమిదే..
కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (CAT) తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణమని పేర్కొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ చేసిన ప్రకటనే తొక్కిసలాటకు దారి తీసిందని అభిప్రాయపడింది. ‘చిన్నస్వామి స్టేడియం బయట సుమారు ఐదు లక్షల మంది ప్రజలు గుమిగూడటానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీనే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు మనుషులే కదా.. వాళ్లేమీ దేవుళ్లో.. లేదంటే ఇంద్రజాలికులో కాదు. ఇలా అనుకోగానే.. అలా భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీసుల వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదు’ అని ట్రైబ్యునల్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com