Rishabh Pant: త్వరలో మైదానంలోకి పంత్‌

Rishabh Pant: త్వరలో మైదానంలోకి పంత్‌
వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్‌... త్వరలో మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న స్టార్‌ బ్యాట్స్‌మెన్‌... ప్రపంచకప్‌ టీంలో స్థానమే లక్ష్యం....

క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌ త్వరలో మైదానంలోకి రానున్నాడు. పంత్ వేగంగా కోలుకున్నాడని... అతను త్వరలో మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నామని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ DDCA డైరెక్టర్‌ శ్యామ్ శర్మ తెలిపాడు. DDCA డైరెక్టర్లు శ్యామ్ శర్మ, హరీష్ సింగ్లా నేతృత్వంలోని కమిటీ రిషబ్ పంత్‌ను కలిశారు. పంత్‌ కోలుకుంటున్నాడని, ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాడని... అతడు జట్టులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని శ్యామ్‌ శర్మ తెలిపాడు. వీలైనంత త్వరగా పంత్‌ను మనం మైదానంలో చూడొచ్చని క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. పంత్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో కోలుకుంటున్నాడు. అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఎలాగైనా జట్టులో చోటు సంపాదించాలని పంత్‌ ప్రయత్నిస్తున్నాడు.


గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కాలికి శస్త్రచికిత్స జరగడంతో దాదాపు మూడు నెలలపాటు మంచానికే పరిమితమైన పంత్.. ప్రస్తుతం ఎవరి సాయం లేకుండా నడుస్తున్నాడు. చేతి కర్ర, ఎవరి సాయం లేకుండా నడుస్తున్నాడు. పంత్‌ త్వరగా కోలుకుని మళ్లీ టీమ్‌ఇండియా తరఫున ఆడాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పంత్‌ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అతడికి అండగా నిలుస్తోంది. అతడికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. గాయం కారణంగా పంత్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడకపోయినా అతడి ఏడాది వేతనం రూ.16 కోట్లు చెల్లించింది. అంతేకాదు రూ.5 కోట్లతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పంత్‌కు బోర్డు మొత్తం వేతనం చెల్లించాలని నిర్ణయించింది.


2002 డిసెంబర్ 30న పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో తన మెర్సిడెస్‌ కారును పంతే నడిపాడు. ఘటనలో పంత్‌ తల, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలిపోయింది. కాలికి ఫ్రాక్చర్‌ అయింది.

ఎన్సీఏలో శిక్షణ పొందుతున్న తన సహచర ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌ను పంత్‌ ఇటీవల కలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను పంత్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. మా గ్యాంగ్‌తో రీ యూనియన్‌ కావడం చాలా సంతోషంగా ఉందంటూ పంత్‌ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా జోడించాడు.

Tags

Read MoreRead Less
Next Story