RO-KO: రోహిత్, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా?

భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచ కప్ టార్గెట్‌గా ఈ ఒక్క ఫార్మాట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. మరో రెండేళ్లు వీరు ఫిట్‌గా ఉండటం కష్టమేనని.. ఫామ్ కోల్పోవచ్చని.. వరల్డ్ కప్ టీంలో చోటు కష్టమేనని ఎన్నో వార్తలు వస్తున్నాయి. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భవితవ్యంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్నందుకే రోహిత్, కోహ్లి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఫామ్, ఫిట్‌నెస్‌పైనే రెండేళ్ల తర్వాత జరిగే మెగా టోర్నీలో వారి స్థానాలు ఖాయమవుతాయి. భవితవ్యంపై నిర్ణయం తీసుకునే దిశగా ఆస్ట్రేలియాతో సిరీస్ వారిద్దరికి కీలకం. ఆ సిరీస్ ఆఖరికి వారు కెరీర్‌పై ఓ నిర్ణయానికి రావొచ్చు. కుర్రాళ్ల నుంచి పోటీ పెరుగుతోందని స్టార్ క్రికెటర్లు ఇద్దరికీ తెలుసు. జట్టు ప్రణాళికల్లో ఉండాలంటే ఏం చేయాలో వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు’’ అని రవిశాస్త్రి చెప్పాడు. అనుభవజ్ఞులు ఎంత రాణించినప్పటికీ.. పెద్ద మ్యాచ్‌ల్లో ఆడినప్పటికీ.. యువకుల నుంచి గట్టి పోటీ నెలకొందని అన్నారు రవిశాస్త్రి. ఇటీవలి కాలంలో శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ వంటి మంచి యువ ఆటగాళ్లు భారత్ తరఫున అద్భుతంగా ఆడుతున్నారని.. ఇక్కడ ముఖ్యంగా ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను ప్రస్తావించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చివరిసారి రోహిత్, కోహ్లీ.. భారత్‌కు ప్రాతినిథ్యం వహించగా.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనున్నారు.
ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని గ్రౌండ్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ క్రికెట్ లో వీరు సంపాదించుకున్న ఫాలోయింగ్ అలాంటిది. ఏ ఏడాది ప్రారంభంలో ఈ ద్వయం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో కనిపించలేదు. టీ20, టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ దిగ్గజ క్రికెటర్లు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక ఇద్దరూ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పగా.. ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు తెలిపి షాక్ కు గురి చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా వన్డేలు ఆడలేదు. ఈ మెగా టోర్నీ తర్వాత ఐపీఎల్.. ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్..ఆసియా కప్ తో ఆడుతూ భారత జట్టు బిజీగా మారింది. దాదాపు 7 నెలలు తర్వాత రోహిత్-కోహ్లీని గ్రౌండ్ లో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మెగా సిరీస్ కు వారం రోజుల సమయమే ఉంది. అక్టోబర్ 15న భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా బయలుదేరనుంది. తొలి వన్డే ఆదివారం (అక్టోబర్ 19) పెర్త్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ, రోహిత్ బరిలోకి దిగుతారనుకుంటే ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగలనుంది. వాతావరణ రిపోర్ట్స్ ప్రకారం తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com