ROHIT: ఒక్క ఏడాది.. 50 రికార్డులు.. రో"హిట్"

క్రికెట్ చరిత్రలో కొన్ని సంవత్సరాలు ఆటగాళ్లను లెజెండ్స్‌గా మలుస్తాయి. 2025 అలాంటి సంవత్సరమే. రోహిత్ శర్మ కెరీర్లో స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన అధ్యాయం 2025. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, నాయకుడిగా… ప్రతి పాత్రలోనూ రోహిత్ తన ముద్రను గట్టిగా వేశాడు. అతడి కెప్టెన్సీలో భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని అధిరోహించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ వంటి బలమైన జట్టును ఎదుర్కొన్న వేళ, ఒత్తిడిని అవకాశంగా మార్చుకున్నాడు రోహిత్. మ్యాచ్ నిర్ణాయక క్షణాల్లో ఆడిన 76 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్ అతడి అనుభవానికి, ప్రశాంతతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. అదే ఇన్నింగ్స్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందించింది. 2025 సంవత్సరం మొత్తం రోహిత్ శర్మ పేరు వెంట పరుగులు, రికార్డులు పరుగు తీశాయి. 50కి పైగా రికార్డులు... కొన్ని వ్యక్తిగతమైనవి, మరికొన్ని జట్టు విజయాలకు బాటలు వేసినవి. ఓపెనర్‌గా కొత్త ప్రమాణాలు, కెప్టెన్‌గా కొత్త దారులు చూపించిన ఈ ఏడాది, రోహిత్ శర్మను కేవలం ఒక స్టార్‌గా కాదు…భారత క్రికెట్ యుగానికి ప్రతీకగా నిలిపింది.
అత్యధిక వన్డే సిక్స్‌లు
రోహిత్ శర్మ ఈ ఏడాది షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న ఒక పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ గత 10 సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఖాతాలో ప్రస్తుతం 355 వన్డే సిక్స్‌లు ఉన్నాయి. అఫ్రిది 351 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ అంటే సిక్సర్ల కింగ్ అని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఏడాది 2025. ఎన్నో జ్ఞాపకాలను అభిమానులకు మిగిల్చింది.
రికార్డులే రికార్డులు
రోహిత్ శర్మ సేనా దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను మొత్తం 14 వన్డే సెంచరీలు సాధించాడు. అంతేకాక.. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ (15,933).. ఓపెనర్‌గా భారత్ తరపున సంయుక్తంగా అత్యధిక సెంచరీలు (45). సచిన్ సైతం ఓపెనర్‌గా ఇదే రికార్డ్ కూడా నెలకొల్పాడు. కెప్టెన్‌గా ICC టోర్నమెంట్లలో సంయుక్తంగా అత్యధికంగా నాలుగు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు గెలుచుకున్న ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరపున సంయుక్తంగా అత్యధిక (4) ICC ట్రోఫీలు గెలుచుకున్నాడు రోహిత్ శర్మ. ICC వన్డేల్లో కెప్టెన్‌గా 93.8 శాతం విజయ శాతంతో చరిత్ర సృష్టించడమే కాక, భారత్ తరపున కెప్టెన్‌గా ODIల్లో అత్యధిక సిక్స్‌లు (126) బాదిన ఆటగాడిగా నిలిచాడు. 38 ఏళ్ల వయసులోనే ODIల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న అత్యధిక వయసున్న భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. విదేశీ బ్యాట్స్‌మన్‌గా ఆస్ట్రేలియాలో అత్యధిక ODI సెంచరీలు (6) చేసిన ఘనతతో పాటు, అక్కడే 1530 పరుగులు చేసి అత్యధిక ODI పరుగులు చేసిన భారతీయుడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాలో ODI సెంచరీ చేసిన అధిక వయసున్న ఆసియా క్రికెటర్, విదేశాల్లో ODI సెంచరీ చేసిన అధిక వయసున్న భారతీయుడుగానూ రికార్డుల జాబితాలోకి చేరాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

