ROHIT: రోహిత్ కెప్టెన్సీ పోవడం వెనుక భారీ కుట్ర.. !

భారత క్రికెట్లో కెప్టెన్సీ అంశం ఎప్పుడూ సున్నితమైనదే. విజయం వచ్చినప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతాయి… అదే సమయంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటే విమర్శలు తీవ్రంగా వినిపిస్తాయి. తాజాగా అలాంటి వివాదానికే తెరలేచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించిన కెప్టెన్ అయిన రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ మార్పు వెనుక అసలు కారణాలేంటి? ఇది కేవలం భవిష్యత్తు ప్రణాళికలో భాగమా, లేక తెర వెనుక మరేదైనా ప్రభావం పనిచేసిందా అనే ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్ అభిమానులను వెంటాడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన వ్యక్తి భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. అయితే ఈ కఠిన నిర్ణయానికి ఆయన ఒక్కడే కారణమా అనే సందేహాలు వెంటనే తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా భారత జట్టు హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
మనోజ్ తివారీ ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అజిత్ అగార్కర్ ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న సెలెక్టర్ అని ఒప్పుకుంటూనే, ఇలాంటి పెద్ద నిర్ణయాలు కోచ్ ఇన్పుట్ లేకుండా జరగవని ఆయన స్పష్టం చేశారు. “చీఫ్ సెలెక్టర్ నిర్ణయం ప్రకటించినా, కోచ్ అభిప్రాయం తప్పకుండా ఇందులో భాగంగా ఉంటుంది. ఒకరి భుజంపై తుపాకీ పెట్టి మరొకరు కాల్చినట్లుగా ఈ వ్యవహారం కనిపిస్తోంది” అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చను మరింత వేడెక్కించాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ నాయకత్వాన్ని తీసుకుంటే, అతని రికార్డు ఏ మాత్రం తక్కువ కాదు.
టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నీల్లో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్‌ను వన్డే ఫార్మాట్ నుంచి తప్పించడం వెనుక క్రికెట్ లాజిక్ ఏంటన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. “విజయాలు సాధించిన కెప్టెన్‌ను ఇలా పక్కన పెట్టడం అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా అసహజమైన నిర్ణయం” అని ఆయన అన్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణంగా సెలెక్షన్ కమిటీ 2027 వన్డే ప్రపంచకప్‌ను చూపుతోంది. ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించారు. రోహిత్ శర్మ వయస్సు ప్రస్తుతం 38 ఏళ్లు కావడం, అతను 2027 ప్రపంచకప్ సమయానికి జట్టులో ఉంటాడో లేదో అన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెలెక్షన్ కమిటీనే రోహిత్‌ని తప్పించినట్టు తెలుస్తోంది. దీనిపై మనోజ్ తివారీ మరింత భావోద్వేగంగా స్పందించారు. “మూడు డబుల్ సెంచరీలు సాధించిన, జట్టు కోసం ఎప్పుడూ నిస్వార్థంగా ఆడే ఆటగాడి సామర్థ్యాన్ని శంకించడం తప్పు. ఇలాంటి నిర్ణయం నాకు వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించింది” అని ఆయన అన్నారు. మేనేజ్మెంట్లో స్పష్టత లేకపోవడం వల్ల తానిక్కడినుంచి వన్డే క్రికెట్ చూడాలనే ఆసక్తి కూడా కొంత తగ్గిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతని నాయకత్వంలో జట్టు ఎన్నో కీలక విజయాలు సాధించింది. అలాంటి కెప్టెన్‌ను అకస్మాత్తుగా పక్కన పెట్టడం ఇప్పుడు గంభీర్ – అగార్కర్ ద్వయంపై విమర్శలకు దారితీస్తోంది. మొత్తంగా మళ్లీ క్రికెట్ లో కెప్టెన్ రచ్చ మొదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

