ROHIT: రోహిత్‌ శర్మ రికార్డుల ఊచకోత

ROHIT:  రోహిత్‌ శర్మ రికార్డుల ఊచకోత
సిక్సర్ల కింగ్‌కా హిట్‌మ్యాన్‌...సచిన్‌ రికార్డు బద్దలు

అప్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన టీమిండియా సారధి రోహిత్ శర్మ మూడు రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. అంతర్జాతీయ కిక్రెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డును సాధించాడు. ఇప్పటివరకు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరుతో ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. అన్ని ఫార్మాట్లలో 553 సిక్సర్లతో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సారధి రోహిత్‌ శర్మ బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు బాదగా... హిట్ మ్యాన్ మాత్రం కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే 554 సిక్సులు బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌కు.. రోహిత్‌ శర్మ మధ్య 78 ఇన్నింగ్స్‌ల తేడా ఉండడం విశేషం.


వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీ చేసిన రోహిత్‌కు ప్రపంచకప్ చరిత్రలో ఇది ఏడో సెంచరీ. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్.. అంతకుముందు 2015లోనూ ఓ సెంచరీ చేశాడు. దీంతో మొత్తం అతడి ఖాతాలో ఏడు సెంచరీలు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న సచిన్ కేవలం ఆరు సెంచరీలు మాత్రమే చేశాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం సంగక్కర, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఐదు సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డేవిడ్ వార్నర్ ఖాతాలో ఇప్పటివరకు నాలుగు వన్డే ప్రపంచకప్ సెంచరీలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా (63 బంతుల్లో) సెంచరీ చేసిన భారత ఆటగాడిగానూ రోహిత్ రికార్డు సాధించాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ మరో రికార్డు సాధించాడు. వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్ గా రోహిత్ అవతరించాడు. రోహిత్ శర్మ 19 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్ కప్ లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్ గా డేవిడ్ వార్నర్ తో పాటు సమంగా నిలిచాడు. ఈ క్రమంలో మెగాటోర్నీలో 1000 పరుగులు దాటిన నాలుగో భారత బ్యాటర్ గా రోహిత్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 19 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (20 ఇన్నింగ్స్‌లు), ఏబీ డివిలియర్స్ (20 ఇన్నింగ్స్‌లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story