Ronaldo Win Title : రొనాల్డో మెరిసెన్... టైటిల్ వచ్చెన్

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ఖాతాలో మరో ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ చేరింది. ఇప్పటికే ఎన్నో ట్రోఫీలను దక్కించుకున్న ఈ స్టార్ ప్లేయర్ రెండేళ్ల తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్‌లో మరో ట్రోఫీని అందుకున్నాడు. ఆసియాకు చెందిన సౌదీ అరేబియా అల్ నాసర్ క్లబ్(Al Nassr) తరఫున బరిలోకి దిగిన రొనాల్డో తన జట్టును అరబ్ క్లబ్ ఛాంపియన్స్ కప్(Arab Club Champions Cup )లో విజేతగా నిలిపాడు. కింగ్ ఫహద్ స్టేడియంలో అల్ హిలాల్ క్లబ్‌తో జరిగిన ఫైనల్లో రొనాల్డో కెప్టెన్సీలోని అల్ నాసర్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. అల్ నాసర్ క్లబ్ చేసిన రెండు గోల్స్ రొనాల్డోనే చేయడం విశేషం. 74, 98 నిమిషాల్లో రెండు గోల్స్ చేసిన రొనాల్డో జట్టు(Nassr to trophy)కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
ఆట పూర్తి సమయంలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయకపోవడంతో ఆట అదనపు సమయానికి దారి తీసింది. ఈ సమయంలో అల్-హిలాల్‌పై అల్ నాస్ర్ 2–1తో గెలిచింది. గత సీజన్‌లో సౌదీ ప్రో లీగ్‌లో రొనాల్డో ట్రోఫీని అందుకోవడంలో విఫలమయ్యాడు. అతని జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం ఈ ఫుట్‌బాల్ స్టార్ ఎలాంటి తప్పు చేయకుండా జట్టుకు టైటిల్ అందించాడు. ఈ టోర్నీలో 38 ఏళ్ల రొనాల్డో 6 గోల్స్ చేశాడు. రొనాల్డోకు గోల్డెన్ బూట్ అవార్డ్ లభించింది.
గత ఏడాది క్రిస్టియానో రొనాల్డో సౌదీ ఆరేబియా క్లబ్ అల్ నాసర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఏడాదికి 200 మిలియన్ల యూరో కంటే ఎక్కువ మొత్తానికి రొనాల్డోతో ఒప్పందం చేసుకున్నట్లు సౌదీ అరేబియా ఫుట్ బాల్ క్లబ్ అల్ నాసర్ ప్రకటించింది. 37 ఏళ్ల రొనాల్డో అల్ నాసర్ క్లబ్ మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. అంటే క్లబ్ తరపున రొనాల్డో 2025 వరకు ఆడతాడు.
క్రిస్టియానో రొనాల్డో చేసుకున్న ఈ ఒక్క డీల్ తో ఏకంగా 4400 కోట్ల రూపాయలు సంపాదించాడు. ప్రఖ్యాత ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ తో తన బంధాన్ని తెంచుకున్న రొనాల్డో.. సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏడాదికి 200 మిలియన్ యూరోల (రూ. 1700 కోట్ల పైనే) కంటే ఎక్కువ విలువైన ఒప్పందం ఇది. 37 ఏళ్ల రొనాల్డో జూన్ 2025 వరకు మొత్తంగా 500 మిలియన్ యూరోలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. మూడేళ్లకు గాను రొనాల్డో భారత కరెన్సీలో అతను ఏకంగా 4400 కోట్ల పైచిలుకు మొత్తం అందుకుంటాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com