ROOT: ఈ దశాబ్దపు బెస్ట్ క్రికెటర్ జో రూట్..!

టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా సచిన్ టెండూల్కర్ స్థాయికి చేరడం అసాధ్యమేనని ఒకప్పుడు భావించారు. కానీ ఆ భావనకు సవాల్ విసురుతున్న ఆటగాడు ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్. నిలకడ, నైపుణ్యం, సహనం రూట్ బ్యాటింగ్‌కు పునాది. కష్టసాధ్యమైన పిచ్‌లపై, ప్రపంచ స్థాయి బౌలర్ల ఎదుర్కొంటూ రూట్ పరుగులు సాధిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్లో దీర్ఘకాలం ఆడగల ఫిట్నెస్, మానసిక దృఢత్వం రూట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా బ్యాటింగ్‌లో స్థిరత్వం చూపడం అతని గొప్పతనం. సచిన్ రికార్డు దిశగా సాగుతున్న ఈ ప్రయాణం రూట్‌ను ఆధునిక టెస్ట్ క్రికెట్లో అత్యంత విశిష్ట ఆటగాళ్లలో ఒకడిగా నిలిపింది.
సచిన్ రికార్డు వైపు...
టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో టెండూల్కర్ 15,921 రన్స్ చేశాడు. వాంఖడే స్టేడియంలో సచిన్ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే 10,806 పరుగులతో ఉన్నాడు. సచిన్ కంటే 5,000 పరుగులు వెనుకబడి ఉన్న మహేలా.. 10 నెలల తర్వాత రిటైర్ అయ్యాడు. ఆ సమయంలో క్రికెట్ దిగ్గజం టెస్ట్ రికార్డుకు ఏ ప్లేయర్ కూడా దగ్గరగా లేడు. దాంతో మాస్టర్ బ్లాస్టర్ రికార్డు బద్దలు కొట్టడం ఇక అసాధ్యమే అనుకున్నారు. కానీ ఇప్పుడు టెస్టు క్రికెట్లో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు బద్దలు కొట్టేందుకు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ చేరువయ్యాడు. ఈ ఏడాది సచిన్ రికార్డును రూట్ బద్దలు కొట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
ఎవ్వరికీ అందనంత ఎత్తులో...
2020 సమయంలో ఫ్యాబ్ 4లో ఆఖరి స్థానంలో ఉన్నాడు ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్. 2020 నాటికి విరాట్ కోహ్లీ, 27 టెస్టు సెంచరీలతో టాప్‌లో ఉంటే... జో రూట్, అప్పటికి 17 టెస్టు సెంచరీలు మాత్రమే చేశాడు. 2025 వరకూ ఐదేళ్లలో 3 టెస్టు సెంచరీలు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ.. 2025లో టెస్టు క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ ఐదేళ్లలో జో రూట్ ఏకంగా 24 టెస్టు సెంచరీలు సాధించి... సంచలనం క్రియేట్ చేశాడు, చేస్తున్నాడు.. వన్డేలతో కలిసి గత ఐదేళ్లలో జో రూట్, అంతర్జాతీయ క్రికెట్లో 26 సెంచరీలు చేశాడు. గత ఆరేళ్లలో 24 టెస్టు సెంచరీలు చేసిన జో రూట్, ఎవ్వరికీ అంతనంత ఎత్తులో ఉన్నాడు. ఈ ఆరేళ్లలో శుభ్‌మన్ గిల్, అన్ని ఫార్మాట్లలో కలిపి 19 అంతర్జాతీయ సెంచరీలు చేస్తే... జో రూట్, కేవలం టెస్టుల్లో 24 శతకాలు బాదేశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బా టెస్టులో సెంచరీ చేసిన జో రూట్, తాజాగా సిడ్నీలో జరుగుతున్న ఆఖరి టెస్టులో మరో సెంచరీ నమోదు చేశాడు. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 242 బంతుల్లో 15 ఫోర్లతో 160 పరుగులు చేశాడు. జోట్ రూట్ నిస్సందేహంగా ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మన్. 2013-2020 మధ్య రూట్ 17 సెంచరీలు చేశాడు. . ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఇంగ్లండ్ ఇంకా 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 2027 నాటికి లిటిల్ మాస్టర్‌ను రూట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

