SAFF Championship: శాఫ్‌ ఛాంపియన్‌ భారత్‌

SAFF Championship: శాఫ్‌ ఛాంపియన్‌ భారత్‌
చివరి నిమిషం వరకూ ఉత్కంఠభరితంగా సాగిన శాఫ్ ఫైనల్‌.... పెనాల్టీ షూటౌట్‌లో కువైట్‌పై భారత్‌ గెలుపు.... తొమ్మిదోసారి టైటిల్‌ కైవసం...

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ శాఫ్‌ టైటిల్‌ను డిపెండింగ్ ఛాంపియన్‌ భారత్‌ నిలబెట్టుకుంది. ఆఖరి నిమిషం వరకు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టేలా సాగిన ఫైనల్‌లోకువైట్‌ను ఛెత్రీ సేన షూటౌట్‌ చేసింది. అద్వితీయ ప్రదర్శనతో రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి శాఫ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌ ఆరంభంలో కువైట్‌ ఆటగాళ్ల జోరు కనిపించింది. దీంతో 14వ నిమిషంలోనే అల్‌ ఖల్దీ గోల్‌తో ఈ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే పుంజుకున్న భారత్‌.. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగింది. అయితే 17వ నిమిషంలో ఛాంగ్తే ప్రయత్నం విఫలమైంది. 22వ నిమిషంలో సాహల్‌ ఫౌల్‌ కారణంగా కువైట్‌కు ఫ్రీకిక్‌ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత్‌ గోల్‌ ఎదురుచూపులకు 38వ నిమిషంలో తెర పడింది. ఛెత్రి నుంచి పాస్‌ను పెనాల్టీ బాక్స్‌లో అందుకున్న సాహల్‌.. నేరుగా దాన్ని ఛాంగ్తేకు అందించాడు. ఎలాంటి పొరపాటుకు తావీయకుండా అతను జట్టుకు తొలిగోల్‌ అందించి స్కోరును 1-1తో సమం చేశాడు. తర్వాతి నిమిషంలోనే భారత్‌కు మరో చాన్స్‌ లభించినా కురుణియన్‌ హెడర్‌ గురి తప్పింది. ద్వితీయార్ధంలోనూ ఇరుజట్ల నుంచి పలు గోల్స్‌ అవకాశాలు వృథా కావడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లింది. అక్కడ కూడా రెండు జట్ల ఆటగాళ్లు ఏమాత్రం తగ్గకపోవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.


పెనాల్టీ షూటౌట్‌లోనూ భారత్‌-కువైట్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. భారత్‌ తరఫున స్టార్‌ స్ట్రయికర్‌ ఛెత్రీతో పాటు సందేశ్‌, సుభాశిశ్‌, చాంగ్టే, మహేశ్‌ గోల్స్‌ చేయగా.. ఉదాంత సింగ్‌ మిస్‌ చేశాడు. కువైట్‌ నుంచి కూడా నలుగురు ఆటగాళ్లు బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపారు. తొలి ఐదు రౌండ్లలో 4-4 గోల్స్‌తో సమానంగా నిలిచాయి. ఈ దశలో ఫలితం కోసం సడెన్‌ డెత్‌ నిర్వహించారు. ముందుగా భారత్‌ నుంచి మహేశ్‌ కీలక గోల్‌ చేయగా.. అటు కువైట్‌ కెప్టెన్‌ ఖాలెద్‌ ప్రయత్నాన్ని కీపర్‌ గుర్‌ప్రీత్‌ అడ్డుకోవడంతో భారత్‌ సంబరాల్లో మునిగిపోయింది. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా నిలిచిన గురప్రీత్‌ ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. కంఠీరవ స్టేడియంలో సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య చివరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ అభిమానులను అలరించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. గ్రూప్‌ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రా’చేసకుంది. సెమీఫైనల్లో లెబనాన్‌పై షూటౌట్‌లోనే నెగ్గి ముందంజ వేసిన ఛెత్రీ సేన వరుసగా రెండో మ్యాచ్‌లో షూటౌట్‌లో విజయం సాధించింది.


ఈ విజయంతో భారత జట్టు కనీవినీ ఎరుగని రీతిలో తొమ్మిదోసారి శాఫ్‌ టైటిల్‌ను దక్కించుకున్నట్టయ్యింది. గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021ల్లోనూ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది విజయంతో భారత్‌కు రూ. 41 లక్షల ప్రైజ్ మనీ దక్కగా... కువైట్‌కు రూ. 30.5 లక్షలు దక్కాయి.

Tags

Read MoreRead Less
Next Story