SAINA: రాకెట్ చేత పట్టి..చైనాకే చెక్ పెట్టి..

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ స్వర్ణయుగానికి ప్రతీకగా నిలిచిన పేరు సైనా నెహ్వాల్. అంతర్జాతీయ వేదికలపై భారత జెండాను గర్వంగా ఎగరవేసిన తొలి మహిళా షట్లర్‌గా, లక్షలాది యువతకు స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారిణి ఆమె. చైనా ఆధిపత్యం నడిచిన కాలంలో, ఆ శక్తివంతమైన వ్యవస్థకు గట్టి సవాల్ విసిరి ప్రపంచ శిఖరాలకు చేరిన ధీర వనితగా సైనా పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె సాధించిన ప్రతి విజయం వెనుక ఉన్నది అపారమైన కష్టం, పట్టుదల, త్యాగం. కోర్టులో ఆమె ఆట మాత్రమే కాదు, భారత మహిళా క్రీడల దిశను మార్చిన ఓ విప్లవం కూడా. 2008 సంవత్సరం సైనా నెహ్వాల్ కెరీర్‌లో కీలక మలుపు. అదే ఏడాది ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై తన సత్తాను ప్రపంచానికి చాటింది. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అప్పటి నుంచే సైనా పేరు ప్రపంచ స్థాయి షట్లర్ల జాబితాలో వినిపించడం ప్రారంభమైంది. జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయికి మారిన తర్వాత కూడా ఆమె ప్రదర్శనలో తగ్గుదల కనిపించలేదు
2009లో సైనా మరో చారిత్రక ఘనత సాధించింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలిచిన తొలి భారత షట్లర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఈ విజయం భారత బ్యాడ్మింటన్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. అదే ఏడాది ఇండోనేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, స్విస్ ఓపెన్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో విజయాలు సాధిస్తూ, సైనా అంతర్జాతీయ సర్క్యూట్లో అగ్రశ్రేణి ఆటగాళ్ల సరసన నిలిచింది. సైనా ఖాతాలో మొత్తం 10 సూపర్ సిరీస్ టైటిళ్లు, 10 గ్రాండ్ ప్రీ టైటిళ్లు ఉన్నాయి. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో సైనా కాంస్య పతకం సాధించింది. ఇది కూడా ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన ఘట్టం. ఆ తర్వాత 2015 సంవత్సరం సైనాకు అత్యంత ప్రత్యేకమైన సంవత్సరం. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. అదే విధంగా ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో కూడా ఫైనల్‌కు చేరి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టైటిల్ దక్కకపోయినా, ఈ రెండు ఫైనల్స్ ఆమె స్థాయిని ప్రపంచానికి మరోసారి చాటాయి.
అదే 2015లో సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఘనత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానం దక్కించుకొని, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్, కొరియా వంటి దేశాల ఆధిపత్యం ఉన్న కాలంలో ఈ స్థాయికి చేరడం అనేది అసాధారణ విజయంగా క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు. 2017 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా మరోసారి తన పోరాట స్ఫూర్తిని చాటింది. తీవ్ర పోటీ మధ్య కాంస్య పతకం సాధించి, ఇంకా తాను టాప్ స్థాయిలో ఉన్నానని నిరూపించింది. 2018 ఆసియా క్రీడల్లో కూడా కాంస్య పతకం గెలిచి, దేశానికి మరోసారి గౌరవం తీసుకొచ్చింది. అదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించి, తన ఖాతాలో మొత్తం మూడు స్వర్ణాలు సహా అయిదు కామన్వెల్త్ పతకాలను నమోదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
