SHAMI: నా రిటైర్మెంట్ ఎవ్వరీ చేతుల్లో లేదు

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గత కొంత కాలంగా ఫిట్ సమస్యలతో సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు భారత జట్టులో కీలక సభ్యునిగా ఉన్న షమీ.. ఇప్పుడు పూర్తిగా టీమ్‌లోనే చోటు కోల్పోయాడు. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరపున ఆడాడు. అజిత్ అగార్కకర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ షమీని పరిగణలోకి తీసుకోలేదు. అతడి స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ యువ పేసర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ టూర్ తర్వాత ఆసియాకప్-2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కూడా షమీకి చోటు దక్కలేదు. దీంతో అతడు త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై షమీ స్పందించాడు. తనకు ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని షమీ చెప్పుకొచ్చాడు.
షమీ కామెంట్స్
"నన్ను ఎంపిక చేయకపోవడంపై నేను ఎవర్నీ తప్పుబట్టను. జట్టుకి నేను సరిపోతే సెలక్ట్ చేయండి, కాదనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. టీమిండియాకు ఏది మంచిదో నిర్ణయించడం సెలక్టర్ల బాధ్యత. నాకు అవకాశం వచ్చినప్పుడు నా వంతు కృషి చేస్తాను. అందుకు తగ్గట్టుగానే శ్రమిస్తాను" అంటూ షమీ అన్నాడు.ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన షమీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దానికి తోడు భారీగా పరుగులు కూడా సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫామ్ కోల్పోయాడనే వార్తలు వచ్చాయి. రిటైర్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపించడంతో వాటిపై కూడా క్లారిటీ ఇచ్చాడు. “ఎవరైనా నా రిటైర్మెంట్ వల్ల వారి జీవితం బాగుపడుతుందనుకుంటే, నేరుగా చెప్పండి. నేను ఎవరి జీవితానికి అడ్డం అవుతున్నానో చెప్పండి. నేను విసిగిపోయిన రోజే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాను. మీరు నన్ను సెలెక్ట్ చేయకపోతే, అంతర్జాతీయ క్రికెట్ ఆడను, కానీ దేశీయ క్రికెట్ ఆడుతాను. ఎక్కడో ఒకచోట ఆడుతూనే ఉంటాను. విసుగు వచ్చినప్పుడే ఆగిపోవాలి. నాకు సమయం రాలేదు. ఉదయం 7 గంటలకు లేచి టెస్ట్ ఆడడానికి ఇష్టంలేకపోతేనే రిటైర్మెంట్ ఆలోచన వస్తుంది. కానీ నాకు ఆ సమయం రాలేదు. అవసరమైతే నేను ఉదయం 5కే లేస్తాను” అని షమీ స్పష్టం చేశాడు.
షమీ ఉద్వేగం
2027 వన్డే ప్రపంచకప్‌ను గెలవడమే తన ఏకైక కల అని షమీ ఉద్వేగంగా చెప్పాడు. "నాకు ఆ ఒక్క కల మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచకప్‌ను గెలిచే జట్టులో భాగమై కప్‌ను స్వదేశానికి తీసుకురావాలి. 2023లో మేము కప్‌కు చాలా దగ్గరగా వచ్చాం. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరినా ఫైనల్లో ఓటమి చెందాం. అభిమానుల ప్రోత్సాహం మాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. కానీ ఆ కల నెరవేరడం బహుశా నా అదృష్టంలో లేదు" అని 2023 ఫైనల్ ఓటమిని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండు నెలలుగా తన ఫిట్నెస్, నైపుణ్యాలపై తీవ్రంగా శ్రమిస్తున్నట్లు షమీ తెలిపాడు. బరువు తగ్గించుకోవడం, బౌలింగ్‌లో లోడ్ పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించానని, ఇప్పుడు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయగలనని చెప్పాడు. గతంలో గాయాల కారణంగా ఎదురైన ఇబ్బందుల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, అందుకే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు కాస్త అసౌకర్యంగా అనిపించడంతోనే తప్పుకున్నానని వివరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com