SHAMI: షమీని ఎందుకు తీసుకోరు.?

విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీల కారణంగా 358 పరుగుల భారీ స్కోరు చేసిన భారత జట్టు, ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో ఒకటికి ఇద్దరు ప్లేయర్లు గాయపడి పెవిలియన్‌లో కూర్చొన్నా సరే, ఎంతో సులువుగా గెలిచేసింది సౌతాఫ్రికా జట్టు. కారణం భారత జట్టు పసలేని బౌలింగ్... దారుణమైన ఫీల్డింగ్! ఫీల్డింగ్ అంటే బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక్క మ్యాచ్‌తో మార్చుకోవచ్చు, మరి బౌలింగ్ సంగతేంటి?
మొదటి వన్డేలో కూడా ఓటమి అంచు దాకా వెళ్లి, బతికి బయటపడింది. లేకపోతే మొదటి వన్డేలో కూడా మనోళ్లు ఓడిపోయేవాళ్లే. అయితే, రెండో వన్డేలో భారత్ ఓడిపోవడంతో, ఒక్కసారిగా మహమ్మద్ షమీ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పటికైనా భారత జట్టులోకి మహమ్మద్ షమీని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. రెండో వన్డేలో హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ లాంటి అనుభవం లేని బౌలర్లకు ఛాన్స్ ఇచ్చి తప్పుచేశారని బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా 70 పరుగులు ఇవ్వగా, ప్రసిద్ కృష్ణ 85 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరు బౌలర్లు పరుగులు కట్టడి చేసి, వికెట్లు తీసి ఉంటే ఇండియా విజయం సాధించేది. కానీ హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ చెత్త ప్రదర్శన కనబరిచి, భారత్ ను ఓడించారని మండిపడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో 7 మ్యాచ్ లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు షమీ. ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్ లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన చూసైనా, షమీని తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిరాజ్ కు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే షమీ లాంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వకుండా బీసీసీఐ వ్యవహరిస్తే, భారత జట్టును కాపాడటం కష్టమే అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

