Asian Games 2023: కెప్టెన్‌గా శిఖర్ ధావన్, కోచ్‌గా లక్ష్మణ్..!!

చైనాలో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు మొదటిసారిగా ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రతిపాదనలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఓకే చెప్పడంతో భారత జట్టు క్రీడల్లో పాల్గొననుంది. చాలా రోజుల తర్జనభర్జనల అనంతరం క్రీడల్లో పాల్గొనడానికి బీసీసీఐ అంగీకరించింది. అయితే అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనే జట్టు కాకుండా భారత-బీ జట్టును పంపనుంది. భారత్ నుంచి పురుషుల, మహిళల జట్టు రెండూ పాల్గొంటాయి.
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. భారత మాజీ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇది ఇంకా ఖరారవ్వలేదు.
ఆసియా క్రీడలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పరిధిలోకి రావు. వాటికి అంతర్జాతీయ గుర్తింపు ఉండని కారణంగానే బీసీసీఐ (BCCI) ఇన్నిరోజులు వేచి చూసే ధోరిణి ఆవలంభించింది. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూలో జరగనున్నాయి. ఆ సమయంలోనే అక్టోబర్ 5 నుంచి నవంబర్ 23 వరకు ఐసీసీ (ICC) పురుషుల వరల్డ్‌కప్ కూడా జరగనుండటం గమనార్హం.
అయితే సెప్టెంబర్ మాసంలో భారత మహిళల జట్టుకు ఎటువంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం లేదు. భారత మహిళల క్రికెట్ జట్టు 2022లో బర్మింగ్‌హాంలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com