SHREYAS: "సర్పంచ్ సాబ్"కు చోటు దక్కకపోవడంపై ఆగ్రహం

టీమిండియా స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కకపోవడం అభిమానుల్లో నిరాశను రేపింది. ఐపీఎల్ 2025లో అద్భుతమైన ప్రదర్శనతో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించినా కూడా సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఈ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ పేరు "సర్పంచ్ సాబ్" ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. ఈ నిక్‌నేమ్ ఓ వైరల్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్లో ఒక పల్లెటూరు కుర్రాడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శ్రేయస్ అయ్యర్ అంటే తనకు చాలా ఇష్టమని, అతన్ని సర్పంచ్ సాబ్ అని పిలుస్తామని చెప్పాడు.
పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా విజయవంతంగా నడిపిస్తున్నందుకు అతన్ని గ్రామానికి నాయకుడితో పోల్చాడు. "సర్పంచ్" అంటే గ్రామంలో ప్రథమ పౌరుడు, నాయకుడు అని అర్థం. ఈ వ్యాఖ్య నెట్టింట వైరల్ కావడంతో పంజాబ్ కింగ్స్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఈ పేరును ఉపయోగించాయి. అక్కడి నుంచి ఈ బిరుదు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఈ నిక్నేమ్పై శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ, "సర్పంచ్ సాబ్ అనే ట్యాగ్ ఎలా వచ్చిందో నాకు స్పష్టంగా తెలియదు. పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ ఇచ్చిందనుకున్నా, కానీ పంజాబ్‌లో ఎక్కడికి వెళ్లినా అందరూ నన్ను అదే పేరుతో పిలుస్తున్నారు" అని తెలిపాడు. ఇలా ఓ అభిమానుడి మాట నుంచి పుట్టిన ఈ పేరు, నేడు అయ్యర్ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
వన్డే కెప్టెన్సీపై ఎలాంటి చర్చలు జరగలేదు
గత కొన్ని రోజులుగా టీమ్‌ఇండియా వన్డే సారథ్యం మార్పుపై వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా శుభ్‌మన్ గిల్‌కి బాధ్యతలు ఇస్తారన్న కథనాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం ‘‘అలాంటి చర్చే జరగలేదు’’ అని స్పష్టంచేశారు. ప్రస్తుతం రోహిత్ శర్మే వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆసియా కప్ తర్వాతే భవిష్యత్ సారథ్యం పై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. గణాంకాల ప్రకారం శుభ్‌మన్ గిల్ వన్డేల్లో 59 సగటుతో ఆడుతున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో సారథ్యం లభించగా, వైస్ కెప్టెన్‌గానూ ఉన్నాడు. వయసు తక్కువ కావడం అతని ప్లస్ పాయింట్. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సత్తా చాటిన అనుభవం కలిగిన ఆటగాడు. గత వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడి ప్రదర్శన బలంగా నిలిచింది. కాబట్టి గిల్, అయ్యర్ మధ్యే వన్డే సారథ్యం పోటీ సాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com