SKY: సూర్య రిటైర్మెంట్ ఖాయమేనా?

SKY: సూర్య రిటైర్మెంట్ ఖాయమేనా?
X
టీ 20 ఫైనల్ తర్వాత సూర్య అల్విదా

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే తుది పోరులో టీమ్ ఇండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. సొంతగడ్డపై భారీ అభిమాన సందోహం మధ్య ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో భారత జట్టుకు కప్పు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు మరో ఆసక్తికర అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ వయసు 35 సంవత్సరాలు. అతను ఇప్పటివరకు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఒక దశలో వన్డే జట్టులో కూడా చోటు సంపాదించినప్పటికీ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అతడి పేలవ ప్రదర్శన తర్వాత వన్డే జట్టులో నుంచి అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. అప్పటి నుంచి అతను పూర్తిగా టీ20 ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టాడు. వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ ఒకేసారి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత టీమ్ ఇండియా టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

సూర్యకుమార్ నాయకత్వంలో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. అతడి సారథ్యంలో జట్టు వరుస విజయాలు సాధించడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత్ అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉంది. ఇలాంటి విజయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే అతడి కెరీర్‌కు అది గొప్ప ముగింపు అవుతుందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు అతడి వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే ముందు సూర్యకుమార్ 68 టీ20 మ్యాచ్‌ల్లో 43.33 సగటుతో 2340 పరుగులు చేసి నాలుగు శతకాలు నమోదు చేశాడు. అయితే కెప్టెన్ అయిన తర్వాత అతడి ఫామ్ కొంత తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నాయకత్వం చేపట్టిన తర్వాత 41 మ్యాచ్‌లు ఆడిన అతను 26.62 సగటుతో 932 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు.

జట్టు వరుసగా సిరీస్‌లు గెలుస్తున్నప్పటికీ ఆ విజయాల్లో సూర్యకుమార్ వ్యక్తిగత పాత్ర పెద్దగా లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా అతడి నాయకత్వం బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం పూర్వపు దూకుడు కనిపించడం లేదని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తన భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని చర్చ సాగుతోంది. ఒకవేళ భారత్ ఫైనల్లో విజయం సాధిస్తే ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. మరోవైపు భారత్ ఓడిపోతే సెలక్టర్లు అతడిపై వేటు వేయొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ తర్వాత సూర్యకుమార్ తీసుకునే నిర్ణయం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags

Next Story