క్రీడలు

కబడ్డీ ప్లేయర్ సోనాలి విష్ణు సింగేట్.. ఒకప్పుడు వేసుకునేందుకు షూస్ లేవు..

పరీక్షలు ఉంటే అర్థరాత్రి వరకు కూర్చుని చదువుకునేది. చదువుని, ఆటని బ్యాలెన్స్ చేసుకోగలనంటేనే ఆడమని చెప్పారు అమ్మానాన్నలు

కబడ్డీ ప్లేయర్ సోనాలి విష్ణు సింగేట్.. ఒకప్పుడు వేసుకునేందుకు షూస్ లేవు..
X

లక్ష్యం పెద్దదైతే ఎదురైన అడ్డంకులు చిన్నవిగానే కనిపిస్తాయి. అది లేదు ఇది లేదు అని అమ్మానాన్నని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కబడ్డీ ఆట మీదనే తన దృష్టి సారించింది. ఇప్పుడు భారత మహిళల కబడ్డీ జట్టులో ఓ ప్రముఖ ప్లేయర్‌గా ఎదిగింది సొనాలీ విష్ణు శింగేట్. కబడ్డీలో కోచింగ్ తీసుకునేందుకు వెళ్లేటప్పుడు షూస్ కూడా కొనుక్కోలేని పరిస్థితి తనది.

తండ్రి సంపాదన అంతంత మాత్రమే. పిల్లలను చదివించడమే ఎక్కువనుకుంటే.. ఆటల పేరుతో వాళ్లు అడిగినవన్నీ కొనిచ్చే ఆర్థిక స్థోమత లేదు తండ్రికి. ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క కబడ్డీ శిక్షణా తరగతులకు హాజరయ్యేది. పరీక్షలు ఉంటే అర్థరాత్రి వరకు కూర్చుని చదువుకునేది. చదువుని, ఆటని బ్యాలెన్స్ చేసుకోగలనంటేనే ఆడమని చెప్పారు అమ్మానాన్నలు.

అందుకు అనుగుణంగానే సోనాలీ నడుచుకునేది. సోనాలీ తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేసేవారు. తల్లి వికలాంగురాలు అయినా మిఠాయిల దుకాణం నడిపించేవారు. సోనాలీకి మొదట క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. అయితే కాలేజీలో ఒక రోజు సరదాగా కబడ్డీ ఆటడం మొదలు పెట్టింది. దాంతో ఆ ఆట పట్ల ఆసక్తి పెరిగింది.

కబడ్డీ కోచ్ రాజేశ్ పడవే సోనాలీకి షూస్, కిట్ కొనిచ్చి, కఠోర శిక్షణ ఇచ్చారు. శిక్షణ మొదలు పెట్టిన కొన్నాళ్లకే రైల్వే జట్టులో చోటు సంపాదించింది సోనాలీ. అక్కడి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ 18వ ఆసియన్ క్రీడల్లో భారత్ తరపున ఆడే అవకాశం సంపాదించుకుంది.

ఆమె ప్రతిభను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో అత్యున్నత పురస్కారమైన శివ్ ఛత్రపతి అవార్డును అందజేసి సోనాలీని సత్కరించింది. మరుసటి ఏడాది 67వ జాతీయ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచారు.

Next Story

RELATED STORIES