ICC: ఐసీసీ క్రికెట్ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా గంగూలీ

ICC: ఐసీసీ క్రికెట్ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా గంగూలీ
X
అంతర్జాతీయ క్రికెట్‌లో మళ్లీ మొదలైన దాదాగిరి

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ క్రికెట్‌ చైర్మన్‌గా మళ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితుడయ్యాడు. దుబాయ్‌లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా దాదాను మరోమారు ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. మరో టీమిండియా లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ కమిటీలో మెంబర్‌గా కొనసాగనున్నాడు. వెస్టిండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్, ఆఫ్ఘానిస్థాన్‌ నుంచి హమిద్ హసన్, సౌతాఫ్రికాకు చెందిన బవుమా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్థానంలో 2021లో ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా గంగూలీ బాధ్యతలు అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆ పోస్ట్‌కు ఎంపికయ్యాడు. దాదా మరోసారి ఐసీసీలో కీలక పదవిని దక్కించుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట కంగ్రాట్స్ గంగూలీ హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది.

మహిళల క్రికెట్‌ కమిటీకి కూడా..

మహిళల క్రికెట్ కమిటీని కేథరిన్ క్యాంప్‌బెల్ ముందుండి నడిపించనున్నారు. ఈ కమిటీలో క్యాంప్‌బెల్‌తో పాటు అవ్రిల్ ఫహే (ఆస్ట్రేలియా)తో పాటు మొసెకి (సౌతాఫ్రికా) కూడా మెంబర్స్‌గా ఉన్నారు. ఇకపోతే, నిన్న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐసీసీ మరో డెసిషన్ తీసుకుంది. ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో చెల్లాచెదురైన ఆ దేశ విమెన్స్ క్రికెటర్స్ కోసం స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు ఈ టాస్క్‌ఫోర్స్‌కు సహకారం అందించనున్నాయి.

గంగూలీ ప్రయాణం ఇదీ

2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021లో తొలిసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. నాటి నుంచి గంగూలీ ఈ పదవిలో కొనసాగుతున్నారు. 52 ఏళ్ల గంగూలీ భారత లెజెండరీ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే నుండి ఈ పదవిని స్వీకరించారు. కుంబ్లే గరిష్టంగా అనుమతించబడిన మూడు మూడు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత పదవీ విరమణ చేశారు. గంగూలీ, లక్ష్మణ్‌లతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబడిన కమిటీలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ ఐకాన్ డెస్మండ్ హేన్స్, దక్షిణాఫ్రికా ప్రస్తుత టెస్ట్ మరియు వన్డే జట్టు కెప్టెన్ టెంబా బవుమా, ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్ ఉన్నారు.భారత జట్టులో విజయవంతమైన సారధిగా గంగూలీ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ సమయంలో భారత జట్టు దూకుడుకు మూల కారణంగా నిలిచాడు. దీంతో గంగూలీ పేరు ప్రపంచ క్రికెట్ లో మార్మోగింది.

Tags

Next Story