Sourav Ganguly: హ్యాపీ బర్త్‌డే "దాదా"

Sourav Ganguly: హ్యాపీ బర్త్‌డే దాదా
51వ పడిలోకి అడుగుపెట్టిన దిగ్గజ సారధి గంగూలీ... కెప్టెన్‌గా భారత క్రికెట్‌ తలరాతను మార్చిన దాదా... టీమిండియా విజయవంతమైన సారధిగా ఖ్యాతి....

సౌరభ్‌ గంగూలీ...టీమిండియాకు దూకుడును పరిచయం చేసిన సూపర్ కెప్టెన్.... మ్యాచ్ ఫిక్సింగ్‌ ఉదంతంతో మసకబారిన భారత క్రికెట్‌ను స్వర్ణ యుగం వైపు నడిపించిన నాయకుడు... మైదానంలోనూ, వ్యక్తిగత జీవితంలో ఎక్కడా రాజీపడని దాదా. ప్రపంచ క్రికెట్‌ను అజేయంగా ఏలుతున్న ఆస్ట్రేలియాకు షాక్‌ ఇచ్చిన ఘనుడు. ఎందరో యవకులను జట్టులోకి తెచ్చి భారత క్రికెట్‌ తల రాతను మార్చిన దిగ్గజ సారధి.. ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కత్తా... మహారాజా ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌, గాడ్‌ ఆఫ్‌ ది ఆఫ్‌సైడ్‌ అని క్రికెట్‌ ప్రేమికులు ముద్దుగా పిలుచుకునే గంగూలీ జులై 8న 51వ పడిలోకి అడుగుపెట్టాడు.


భారత్ క్రికెట్‌ను కుదిపేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఘటనతో కెప్టెన్సీ చేపట్టడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో జట్టు పగ్గాలు అందుకున్నాడు సౌరభ్‌. అంతే తన దూకుడైన సారథ్యంతో జట్టును మార్చేశాడు. తన అటిట్యూడ్‌తో భారత్ జట్టుకు దూకుడును నేర్పాడు.


1992లో వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్‌తో దాదా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మరో నాలుగేళ్ల వరకు అతనికి టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశమే దక్కలేదు. 1996 ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో గంగూలీకి అనూహ్యంగా అవకాశం దక్కింది. క్రికెట్ మక్కా లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో తొలి టెస్ట్ ఆడిన దాదా.. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాది టీంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కెరీర్‌లో 113 టెస్టులాడిన గంగూలీ 42.17 సగటుతో 16 శతకాలు, 35 అర్ధ శతకాల సాయంతో 7212 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 239. 311 వన్డేలు ఆడిన దాదా 41.02 సగటుతో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11,363 పరుగులు సాధించారు. అత్యుత్తమ స్కోరు 183. కెప్టెన్‌గా భారత్‌ను 49 మ్యాచ్‌ల్లో నడిపించిన ఈ దిగ్గజ సారధి.. 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. 147 ODIలకు కెప్టెన్‌గా వ్యవహరించి... 76 మ్యాచ్‌లను గెలిపించాడు. 2003లో ప్రపంచ కప్ ఫైనల్స్‌కు భారత్‌ను నడిపించి చరిత్ర సృష్టించాడు. IPLలోనూ 59 మ్యాచ్‌లు ఆడిన సౌరభ్‌ 1,349 పరుగులు చేశాడు.


ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌లో లార్డ్స్ బాల్కనీలో దాదా చొక్కా విప్పిన ఘటన అభిమానులపై చెరగని ముద్ర వేసింది. ఫైనల్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుత ప్రదర్శనతో భారత్‌ గెలవగానే గంగూలీ చేసిన సింహనాదం భారత క్రికెట్‌ తలరాతను మార్చేసింది. ఈ విజయంతో మరింత దూకుడుగా మారిన దాదా.. కెప్టెన్‌గా భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. 2003 ప్రపంచకప్‌లో గంగూలీ కెప్టెన్సీలోనే టీమిండియా ఫైనల్‌కు చేరింది.


కెప్టెన్‌గా దాదా ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మహమ్మద్ కైఫ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ, ఆశిష్ నెహ్రా లాంటి వారందరూ గంగూలీ నాయకత్వంలో రాటుదేలిన వారే. 2005లో ఫామ్‌ కోల్పోవడంతో దాదా జట్టుకు దూరమయ్యారు. ఆస్ట్రేలియాతో 2008లో నాగ్‌పుర్‌లో చివరి టెస్ట్‌ ఆడిన సౌరభ్‌... 2011లో పాక్‌పై చివరి వన్డే ఆడాడు. 2012లో ఐపీఎల్‌కు, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా భారత క్రికెట్‌లో చాలా మార్పులు తీసుకొచ్చారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్, రంజీ ప్లేయర్ల జీతాలు, పురుష, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story